సంప్రదింపులతో సరిహద్దు సమస్యకు పరిష్కారం

14 Jun, 2020 16:45 IST|Sakshi

ఎవరికీ భయపడం : రాజ్‌నాథ్‌

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌, చైనాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభనను ఇరు దేశాలు సైనిక, దౌత్య సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం జమ్మూలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ భారత్‌, చైనాల మధ్య ప్రస్తుతం లడఖ్‌లో సరిహద్దు వివాదం నెలకొందని దీనిపై విపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తాయని చెప్పారు.

ఇరు దేశాల చర్చలపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం చేరవేస్తున్నామని చెప్పారు. ఈ వివాద పరిష్కారానికి సైనిక కమాండర్ల స్ధాయి చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. భారత్‌ బలహీన దేశం కాదని, జాతి ప్రయోజనాలతో ఎన్నడూ రాజీపడబోమని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ స్ధాయిలో భారత్‌ సామర్ధ్యం ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పుకొచ్చారు. దేశాన్ని కాపాడుకునేందుకు భారత్‌ తన సైన్యాన్ని బలోపేతం చేస్తోందని, మనం ఏ ఒక్కరికీ భయపడేదిలేదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం కాలయాపన చేయకుండా రక్షణ దళాల చీఫ్‌ను నియమించిందని గుర్తుచేశారు.

చదవండి : అడకత్తెరలో పోకచెక్క... భారత్‌

మరిన్ని వార్తలు