‘అసహన’ ఆరోపణలపై రాజ్‌నాథ్‌ కౌంటర్‌

23 Dec, 2018 20:24 IST|Sakshi
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (ఫైల్‌ఫోటో)

లక్నో : దేశంలో అసహనం పెరిగిపోతుందన్న ఆరోపణలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తిప్పికొట్టారు. భారత్‌లో ఉన్న సహనశీలత ప్రపంచంలో మరే దేశంలోనూ లేదని చెప్పుకొచ్చారు. భారత్‌లోనే సహనం ఉందని..ప్రపంచంలో మరే చోట ఇది ఉందని తాను అనుకోవడం లే’దని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ వర్సిటీ 114వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనేందుకు ఆదివారం ఇక్కడికి వచ్చిన రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

భిన్న మతాలకు చెందిన ప్రజలు శాంతియుతంగా కలిసి జీవించే వాతావరణం కేవలం భారత్‌లోనే ఉందని, భారత్‌ను సాధికార దేశంగా, స్వయం సమృద్ధి సాధించే దిశగా వారు పాటుపడుతున్నారని, ఈ పరంపర కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల ఆరంభంలో యూపీలోని బులంద్‌షహర్‌లో పోలీస్‌ అధికారి మృతి నేపథ్యంలో నటుడు నసీరుద్దన్‌ షా వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్‌నాథ్‌ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. హింసాకాండలో మరణించిన పోలీసు కంటే చనిపోయిన ఆవుకే అధిక ప్రాధాన్యత లభించిందని నసీరుద్దీన్‌ షా ఆందోళన ‍వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు