‘ఇక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పైనే చర్చలు’

18 Aug, 2019 15:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే అది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)కే పరిమితమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తేల్చిచెప్పారు. ఉగ్రవాదులకు పొరుగు దేశం ఆశ్రయం ఇవ్వకుండా ఉంటేనే పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. హర్యానాలో ఆదివారం జరిగిన జనాశీర్వాద్‌ ర్యాలీని ఉద్దేశించి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్‌ అభివృద్ధిని ఆశించే ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని, దీనిపై పాకిస్తాన్‌ అంతర్జాతీయ సమాజం ఎదుట రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.

ఇక పాకిస్తాన్‌తో పీఓకేపైనే చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. బాలాకోట్‌ కంటే భారీ చర్యలకు భారత్‌ ఉపక్రమించిందని ఇటీవల పాక్‌ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బాలాకోట్‌లో భారత్‌ జరిపిన చర్యలను పాక్‌ ప్రధాని గుర్తించినట్టు ఆయన వ్యాఖ్యలతో స్పష్టమైందని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ నిమిషాల వ్యవధిలో ఆర్టికల్‌ 370ను రద్దు చేసిందని, తాము ఎన్నడూ అధికార దాహంతో రాజకీయాలు చేయబోమని చెప్పారు. మేనిఫెస్టోలో ప్రస్తావించిన మేరకు ఆర్టికల్‌ 370ను రద్దు చేసి ఎన్నికల హామీని నెరవేర్చామని చెప్పారు.

మరిన్ని వార్తలు