రాజ్‌నాథ్ సింగ్‌ను తొలగించండి..

26 Nov, 2015 16:44 IST|Sakshi
రాజ్‌నాథ్ సింగ్‌ను తొలగించండి..

న్యూఢిల్లీ: రాజ్యాంగ పీఠికలోని సోషలిస్ట్, సెక్యులర్ పదాలపై చెలరేగిన వివాదం పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా మరోసారి రాజుకుంది. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు శాంతారాం నాయక్  మండిపడ్డారు. లోక్సభలో హోంమంత్రి రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు.   బాధ్యత మర్చిపోయి వ్యవహరించిన  ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
 
42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన సెక్యులర్ పదం దుర్వినియోగమవుతోంని రాజ్‌నాథ్ గురువారం నాడు లోక్‌సభలో చేసిన ప్రసంగంపై ఆయన స్పందించారు. ఇలా రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తూ చట్టసభలో మాట్లాడడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని నాయక్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని హోంమంత్రి ఉల్లంఘించారని ఆరోపించారు. తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్  చేశారు. తక్షణమే ఆయనను  తొలగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తిచేశారు. ఇలాంటి  రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యల వల్లే  దేశంలో అసహనం వ్యాప్తి చెందిందని నాయక్ మండిపడ్డారు.

కాగా రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలన్న శివసేన డిమాండ్‌పై చర్చకు సిద్ధమని గతంలో ప్రకటించి ఎన్డీయే సర్కారు చిక్కుల్లో పడింది. ఆ పదాలు లేని పాత రాజ్యాంగ పీఠిక చిత్రాన్ని ప్రచురించి ఓ ప్రకటన విడుదల చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి.  ఈ  నేపథ్యంలో ఆ పదాలను తొలగించే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు