నక్సలిజంపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు

17 Mar, 2018 13:42 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ప్రధాన  సమస్యగా మారిన నక్సలిజాన్ని కేవలం యుద్ధం, బులెట్స్‌ ద్వారానే అంతం చేయలేమని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. స్వాతంత్య్రం తర్వాత కూడా మనం చేరుకోలేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేస్తేనే నక్సల్‌ ప్రభావం తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ‘రైజింగ్‌ ఇండియా’ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్‌నాథ్‌ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా  దేశంలో నక్సలిజం ప్రధాన సమస్యగా మారిందని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఒక్కటే దానిని అంతం చేయగలదని పేర్కొన్నారు. 

గత నాలుగేళ్లతో పోలిస్తే ఇప్పడు నక్సలిజం సమస్యను ఎంతో అధిగమించామని, ఇది ప్రభుత్వ విజయమన్నారు. దేశంలో వెనుకబడిన గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల  హెల్త్‌స్కీం ఆ సమస్యలను తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధికి ఆర్థికవేత్తలు, మేధావులు, సైంటిస్టుల సహకారం కావాలని, అప్పుడే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు