లద్దాఖ్‌లో పర్యటిస్తున్న రక్షణశాఖ మంత్రి

17 Jul, 2020 09:34 IST|Sakshi

న్యూఢిల్లీ: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ శుక్రవారం ఉదయం‌ లద్దాఖ్‌ చేరుకున్నారు. భారత్‌-చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన పర్యటిస్తున్నారు. ఆయన వెంట త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావ‌త్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే కూడా ఉన్నారు.‌ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులను మంత్రి కలసి సంఘీభావం తెలపనున్నారు. ఇక ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సఖ్యత నెలకొనేందుకు భారత్‌-చైనా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కమాండర్‌ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. 

ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి రెండు దేశాల సైనిక బలగాలు కొంతమేరకు వెనక్కు వెళ్లాయి. ఈ నేపథ్యంలో యథాతథ స్థితిని కొనసాగించేందుకు.. ప్రస్తుతం ఎల్‌ఏసీ వెంబడి నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు రక్షణ శాఖ మంత్రి లద్దాఖ్‌లో పర్యటిస్తున్నారు. లద్దాఖ్‌, సెక్టార్‌ 4, వాస్తవాధీన రేఖ వెంబడి పరస్థితులను ఆయన సమీక్షిస్తారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శనివారం శ్రీనగర్‌లో పర్యటిస్తారు. నియంత్రణ రేఖ, శ్రీనగర్‌ లోయలో నెలకొన్న పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు. కాగా, కొద్ది రోజులే కిందటే రాజ్‌నాథ్‌ సింగ్‌ లద్దాఖ్‌ పర్యటకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ అది వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈలోపే ప్రధాని మోదీ లద్దాఖ్‌లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. 

మరిన్ని వార్తలు