చొరబాట్లు ఆపేవరకు ఇంతే

22 Oct, 2019 04:01 IST|Sakshi

దాడులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

లేహ్‌: సరిహద్దుల వద్ద చొరబాట్లకు భారత ఆర్మీ పాకిస్తాన్‌కు తగిన సమాధానం చెప్పిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు. పాక్‌ చొరబాట్లను ఆపని పక్షంలో ఇలాంటి చర్యలే కొనసాగుతాయని హెచ్చరించారు. శ్యోక్‌ నది సమీపంలోని తూర్పు లదాఖ్‌లో నిర్మించిన 1,400 అడుగుల కోల్‌ చెవాంగ్‌ రించేన్‌ వంతెనను సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆర్టికల్‌ 370, 35ఏ రద్దు తర్వాత లదాఖ్‌తో స్నేహ బంధం మాత్రమే ఉంటుందని.. శత్రుత్వానికి చోటు ఉండదన్నారు. పాక్‌ విషయంలో సాయుధ దళాలు ముందస్తు దాడులు చేయలేదని, పాక్‌ కాల్పులు జరిపిన తర్వాతనే ఎదురుదాడులు చేశాయని చెప్పారు. భారతదేశ సమగ్రతను అస్థిరపరచడానికి, బలహీనపరచడానికి పాక్‌ ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. దీనికి మన సాయుధ దళాలు గట్టిగానే బదులిస్తున్నాయని అన్నారు.   

సియాచిన్‌ పర్యటనకు అనుమతి..
లేహ్‌–లదాఖ్‌: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమిగా పేరుగాంచిన సియాచిన్‌పైకి పర్యాటకులను అనుమతినిస్తున్నట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. కునార్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి కునార్‌ పోస్ట్‌ వరకు ఉన్న మార్గాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. లదాఖ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.  

పాక్‌ ఉగ్రదాడులు ఆపాలి: గవర్నర్‌
పాక్‌ ఉగ్రదాడులు ఆపకపోతే భారత ఆర్మీ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోకి చొచ్చుకువెళ్లి అక్కడి ఉగ్రస్థావరాలపై విరుచుకుపడుతుందని కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌  వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని.. ఉగ్రక్యాంపుల ఏర్పాటు మానుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో భారత ఆర్మీ ఉగ్ర క్యాంపులను కూల్చివేస్తుందని చెప్పారు.

కర్తార్‌పూర్‌ టికెట్‌ 1400
దర్బార్‌ సాహిబ్‌ను సందర్శించుకునే సిక్కు యాత్రికుల కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్‌ కారిడార్‌ నుంచి సంవత్సరానికి సుమారు భారత కరెన్సీ ప్రకారం రూ.258 కోట్ల మేర ఆదాయం పొందాలని పాకిస్తాన్‌ భావిస్తోంది. దీనికోసం కర్తార్‌పూర్‌ సందర్శనకు వచ్చే భక్తుల నుంచి పెద్దమొత్తంలో ప్రవేశ రుసుము వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఒక్కో భక్తుడు సుమారు రూ.1,400 చెల్లించాలని పేర్కొంది. దీనిపై భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఈ నెల 23న కారిడార్‌కు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి.

భారత్‌కు పాక్‌ తపాలా సేవలు బంద్‌
జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం ఆగస్టులో 5వ తేదీన తీసుకున్న నిర్ణయానికి నిరసనగా అదే నెల 27 నుంచి భారత్‌తో పాక్‌ తపాలా సేవలను నిలిపివేసింది. రెండు దేశాల మధ్య తపాలా సర్వీసులు రెండు నెలలుగా నిలిచిపోయినట్లు  తపాలా శాఖ మంత్రి రవిశంకర్‌ ధ్రువీకరించారు. తపాలా సేవలను పాకిస్తాన్‌ ఏకపక్షంగా నిలిపివేసింది. ‘భారత్‌ నుంచి ఉత్తరాలు తీసుకోవడం లేదు. దీనిపై ప్రభుత్వానికి ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పాక్‌ నిర్ణయం ప్రపంచ తపాలా సంఘం నిబంధనలకు విరుద్ధం. ఎంతైనా అది పాకిస్తాన్‌ కదా..!’ అని వ్యాఖ్యానించారు. ఆ చర్యకు బదులుగా భారత్‌ కూడా పాక్‌ మెయిళ్లను తీసుకోవడం బంద్‌ చేసిందన్నారు. భారత్, పాక్‌ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సౌదీ విమాన సర్వీసుల ద్వారా జరుగుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు