పాక్‌పై రాజ్‌నాథ్‌ మండిపాటు.. తీవ్ర హెచ్చరికలు

23 Sep, 2019 08:35 IST|Sakshi

పట్నా: ఒకవేళ పాకిస్తాన్‌ 1965,1971 కాలంలో చేసిన తప్పులను మళ్లీ పునరావృతం చేయాలని చూస్తే.. ఈ సారి ప్రపంచంలోని ఏ శక్తి పాక్‌ను కాపాడలేదంటూ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. ఆర్టికల్‌ 370 రద్దు, కశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ తర్వాత పాక్‌ దుందుడుకుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ హెచ్చరికలు చేయడం ప్రాధన్యత సంతరించుకున్నాయి. ఆదివారం బిహార్‌ పట్నాలో నిర్వహించిన ‘జన్‌ జాగరణ్‌’ సభకు రాజనాథ్‌ సింగ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాక్‌ 1965,1971లో చేసిన తప్పులను మళ్లీ పునరావృతం చేయాలని చూస్తే.. అప్పుడు వారు పాక్‌ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) గురించి ఆలోచించుకోవాలి. బలూచ్‌, పస్తూన్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనల గురించి ఆలోచించుకోవాలి. అలాకాకుండా పాక్‌ గనక దుందుడుకు చర్యలకు పాల్పడితే.. అప్పుడు భారత్‌ కోపాగ్ని నుంచి ప్రపంచలోని ఏ శక్తి పాకిస్తాన్‌ని కాపాడలేదు’ అంటూ రాజ్‌నాథ్‌ హెచ్చరించారు.
(చదవండి: రాజ తేజసం)

‘నెహ్రూ కారణంగా వచ్చిన ఆర్టికల్‌ 370 అనే రాచపుండు ఏళ్లుగా దేశంలో రక్తపాతం సృష్టించింది. గతంలో ఈ ఆర్టికల్‌ గురించి నెహ్రూ ఇది కేవలం తాత్కలికమే అని.. భవిష్యత్తులో ఈ ఆర్టికల్‌ను తొలగిస్తామని తెలిపారు. కానీ అలా జరగడానికి దాదాపు 72 ఏళ్లు పట్టింది. నాడు కాంగ్రెస్‌ చేసిన తప్పును బీజేపీ సరి దిద్దింది. కశ్మీర్‌లోని మూడొంతుల ప్రజలు కేంద్రం నిర్ణయాలను ఆమోదిస్తున్నారు. ఆర్టికల్‌ 370 పట్ల బీజేపీ ఎప్పుడు కఠినంగానే ఉంది. మా పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది అనడానికి ఇదే మంచి ఉదాహరణ. ఆర్టికల్‌ 370 వల్ల కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగింది. ఫలితంగా 41,500 అమాయక ప్రజలు, 5,500 మంది రక్షణ సిబ్బంది ప్రాణాలు కొల్పోయారు’ అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించిన తర్వాతే పాక్‌తో చర్చలు జరుపుతామని.. అది కూడా పీఓకే గురించి మాత్రమే అని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. అంతేకాక రానున్న ఐదేళ్లలో జమ్మూకశ్మీర్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని.. భూతల స్వర్గం అనే మాటను నిజం చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు