‘కశ్మీర్‌పై పాక్‌కు ఎలాంటి హక్కు లేదు’

29 Aug, 2019 13:57 IST|Sakshi

పాక్‌కు రాజ్‌నాథ్‌ ఘాటు హెచ్చరిక

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌పై పాకిస్తాన్‌ తీరును రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్రంగా తప్పుపట్టారు. కశ్మీర్‌ వ్యవహారంలో నిరాధార వ్యాఖ్యలు చేయరాదని పాకిస్తాన్‌ను ఆయన గురువారం హెచ్చరించారు. కశ్మీర్‌లోయ భారత్‌ అంతర్భాగమని పునరుద్ఘాటిస్తూ ఈ ప్రాంతంపై పాక్‌ ప్రమేయం ఉండబోదని, దీనిపై భ్రమల్లో ఉండరాదని తేల్చిచెప్పారు. గిల్గిత్‌-బల్టిస్తాన్‌ను పీఓకేతో పాటు పాకిస్తాన్‌ అక్రమంగా ఆక్రమించుకుందని ఆరోపించారు.

కశ్మీర్‌ లోయ మొత్తం భారత్‌లో భాగమని 1994లో భారత పార్లమెంట్‌ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, దీనిపై తమ వైఖరి సుస్పష్టమని ఆయన పేర్కొన్నారు. భారత్‌ నుంచి విడిపోయి పాకిస్తాన్‌ ఏర్పాటైందని, అసలు కశ్మీర్‌ పాకిస్తాన్‌తో ఎప్పుడు ఉందని రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశ్నించారు. పాకిస్తాన్‌ ఉనికిని తాము గౌరవిస్తామని, అలాగని కశ్మీర్‌పై పాక్‌ ఇష్టానుసారం మాట్లాడటం సరైంది కాదని అన్నారు. పీఓకే ప్రజల మానవ హక్కులను పరిరక్షించేలా పాక్‌ వ్యవహరించాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ లడక్‌ రాజధాని లీలో జరిగే కార్యక్రమంలో హాజరవుతున్న నేపథ్యంలో ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు