ఉగ్ర పాక్‌ను ఏకాకి చేయాలి

19 Sep, 2016 03:52 IST|Sakshi
ఉగ్ర పాక్‌ను ఏకాకి చేయాలి

ఉగ్రదాడిపై హోం, రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో రాజ్‌నాథ్
రష్యా, అమెరికా పర్యటనల్ని రద్దుచేసుకున్న హోం మంత్రి

 
న్యూఢిల్లీ/శ్రీనగర్: యూరిలో ఉగ్ర దాడిపై భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని, దాన్ని ఒంటరి చేయాలంటూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. యూరిలోని సైనిక బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు కఠోర శిక్షణ పొందారని, అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దాడి వెనుక సూత్రధారుల్ని పట్టుకుని చట్టం ముందు నిలబెడతామన్నారు. 17 మంది సైనికుల మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపంతో పాటు, గాయపడ్డవారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రత్యక్ష సహకారం కొనసాగించడంపై రాజ్‌నాథ్ అసంతృప్తిని వెలిబుచ్చారు. దాడి అనంతర పరిస్థితిని సమీక్షించేందుకు రాజ్‌నాథ్ అత్యవసర భేటీ నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదా రు అజిత్ డోవల్, హోం శాఖ, ఆర్మీ, పారామిలటరీకి చెందిన ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు. సమావేశ వివరాల్ని ప్రధానికి వివరించానని రాజ్‌నాథ్ తెలి పారు. ఉగ్రదాడి నేపథ్యంలో రష్యా, అమెరికా పర్యటనల్ని రాజ్‌నాథ్ వాయిదా వేసుకున్నారు. నాలుగు రోజుల ద్వైపాక్షిక పర్యటన కోసం ఆదివారం రాత్రి రాజ్‌నాథ్ రష్యా వెళ్లాలి. అక్కడి నుంచి ఇండో-యూఎస్ అంతర్గత భద్రతా చర్చల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్ 26 నుంచి ఆరు రోజులు అమెరికాలో పర్యటించాలి.

దాడి ఘటన తెలిసిన వెంటనే జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్ .ఎన్.వోహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీలతో మాట్లాడి పూర్తి వివరాల్ని తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షించాలంటూ హోం కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి, ఇతర అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ గోవా పర్యటనను మధ్యలోనే ముగించి ఆగమేఘాలపై శ్రీనగర్ చేరుకున్నారు. సైనికులపై దాడి, అనంతరం సైన్యం ప్రతిదాడిపై పరీకర్‌కు ఆర్మీ అధికారులు వివరించారు. శ్రీనగర్‌లోని 92 బేస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికుల్ని పరామర్శించారు.
 
అమెరికా, బ్రిటన్ తీవ్ర సంతాపం
భారత సైనికులపై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అమెరికా ప్రకటించింది. బాధితులకు, వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలుపుతూ అమెరికా ప్రభుత్వ ప్రతినిధి జాన్ కిర్బీ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో పటిష్ట భాగస్వామ్యం ఏర్పాటుకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలుపుతూ భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ట్వీట్ చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలసి సాగేందుకు, సూత్రధారుల్ని చట్టానికి పట్టిం చేందుకు బ్రిటన్ సిద్ధమని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి బోరిస్ జాన్సన్ ప్రకటించారు.

మరిన్ని వార్తలు