సీఏఏ, ఎన్‌పీఆర్‌పై రజనీకాంత్‌ కీలక వ్యాఖ్యలు

5 Feb, 2020 13:01 IST|Sakshi

ఎట్టకేలకు తేల్చేసిన రజనీకాంత్‌

సీఏఏ వల్ల ఎవరికీ హాని లేదు

ముస్లింలకు ఆపద వస్తే.. నేనే ముందుంటా

సాక్షి, న్యూఢిల్లీ: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పౌరసత్వ సవరణ చట్టంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, అనుకూల గళాలు ముమ్మరంగా వినిపిస్తున్న నేపథ్యంలో బుధవారం వివాదాస్పద చట్టానికి మద్దతుగా నిలిచారు. సీఏఏ చట్టం ఏ భారతీయ పౌరుడిని ప్రభావితం చేయదని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశంలోని ముస్లింలకు సీఏఏ వల్ల ఎలాంటి ముప్పు ఉండదనీ, ఒకవేళ వారు ఇబ్బందులను ఎదుర్కొంటే, వారికి అండగా నిలబడే మొదటి వ్యక్తి తానే అవుతానని రజనీకాంత్  వెల్లడించారు.

అలాగే జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్) చాలా అవసరమని కూడా వ్యాఖ్యానించారు. బయటివారు ఎవరో తెలుసుకోవడం అవసరమని ఆయన పేర్కొన్నారు. భారత, పాకిస్తాన్‌ విభజన సందర్భంగా భారతదేశంలో ఉండటానికే నిర్ణయించుకున్న ముస్లింలను దేశం నుండి ఎలా పంపిస్తారు?" అని రజనీకాంత్‌ ప్రశ్నించారు. సీఏఏకి వ్యతిరేకంగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలపై ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, దేశ భద్రత, సంక్షేమం కోసం ప్రజలు ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలంటూ గతంలో రజనీకాంత్‌ విజ్ఞప్తి చేయడం గమనార్హం. మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన సీఏఏపై ఇప్పటివరకూ మౌనాన్ని ఆశ్రయించిన రజనీకాంత్‌ చివరకు మద్దతు పలకడం విశేషం. (ఎన్‌పీఆర్‌ అంటే ఏంటి.. ఆ రాష్ట్రానికి ఎందుకు మినహాయింపు?)

కాగా దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా నిరసనల మధ్య గత డిసెంబర్‌లో భారతదేశంలో కొత్త పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ తీవ‍్ర ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.  ముఖ్యంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్  వద్ద 50 రోజులుగా ఆందోళన కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

చదవండి : వరుస కాల్పులు, సీనియర్‌ అధికారిపై వేటు

ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది

>
మరిన్ని వార్తలు