రాజ్యసభ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా

3 Apr, 2020 06:58 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 37 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు వెల్లడించారు. రాజ్యసభకు 55 సీట్లు ఖాళీ కాగా 37 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ‘ప్రమాణస్వీకారానికి గాను నూతనంగా ఎన్నికైన సభ్యులను లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు వేచి ఉండాల్సిందిగా కోరుతున్నాం’ అని రాజ్యసభ చైర్మన్‌ ఒక అడ్వైజరీలో సూచించారు. కొత్తగా ఎన్నికైన వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన జీతభత్యాలన్నీ వారు ఎన్నికైనట్లు ప్రకటించిన నాటి నుంచి వర్తిస్తాయని అధికారులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేసి సభలో తన స్థానంలో కూర్చోవాలి. అయితే, ఇందుకు కాలపరిమితి అంటూ ఏదీ లేదు.

మరిన్ని వార్తలు