రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక షెడ్యూల్‌

6 Aug, 2018 15:53 IST|Sakshi

న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఈ నెల 9న ఎన్నిక జరగనుంది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు సోమవారం సభలో ప్రకటన చేశారు. అభ్యర్థులు ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నంలోపు తమ నామినేషన్‌ను సమర్పించాలని తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌గా పీజే కురియన్‌ పదవీకాలం జూన్‌ 30వ తేదీన ముగిసిన సంగతి తెలిసిందే. బీజేపీ సభలో అతిపెద్దగా పార్టీగా ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయి మెజారిటీ లేకపోవడంతో ఎన్డీయే తరఫున అభ్యర్థిని నిలిపే విషయంలో సమాలోచనలు చేస్తోంది. ఒకవేళ అభ్యర్థిని నిలిపితే ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలు పార్టీలతో బీజేపీ అధినాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది.

మరోవైపు ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంపై చర్చిండానికి ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం విపక్షాలు సమావేశం కానున్నాయి. ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు నిలుచున్న వారికి మద్దతు తెలుపడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు బీజేడీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు