‘జనతా’ బాగా జరిగింది!

24 Mar, 2020 02:02 IST|Sakshi
వైద్యులు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతగా లోక్‌సభలో చప్పట్లు కొడుతున్న మోదీ, రాజ్‌నాథ్‌

ప్రజలు సహకరించిన తీరుపై రాజ్యసభ ప్రశంసలు

సాక్షి, న్యూఢిల్లీ: వైరస్‌ను ఎదుర్కునే ప్రయత్నంలో భాగంగా ఆదివారం జరిగిన జనతా కర్ఫ్యూలో భారతజాతి యావత్తూ ఒకేతాటిపైకి వచ్చి ఐకమత్యాన్ని ప్రదర్శించిందని, అదే స్ఫూర్తిని లాక్‌డౌన్‌ సమయంలోనూ ప్రదర్శించి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనడంలో సహకరించాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. ‘జనతా కర్ఫ్యూకు వచ్చిన ప్రజాస్పందన అద్భుతం. విపత్కర పరిస్థితుల్లో.. దేశమంతా ఒకతాటిపైకి వస్తుందని ప్రజలు సుస్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కునే విషయంలో.. దేశ ప్రజలు సహకరించిన తీరును రాజ్యసభ అభినందిస్తోంది. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతోంది’అని అన్నారు.

రాజ్యసభ చైర్మన్‌ ప్రకటనను సభ్యులు బల్లలు చరిచి స్వాగతించారు. 14 గంటలపాటు భారతీయులంతా జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో కరోనా వైరస్‌ వ్యాప్తిని, ప్రభావాన్ని తగ్గించేందుకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే తదుపరి నియంత్రణ చర్యలకు కూడా సహకరించాలన్నారు. ఈ చర్యలను ఇబ్బందిగా భావించకుండా.. రానున్న కొద్దివారాలు మరింత అప్రమత్తంగా ఉండటం, స్వీయ నియంత్రణ పాటించడం అత్యంత అవసరమన్నారు. మనదేశంలో అసాధారణ పరిస్థితులు తలెత్తకుండా.. సూక్ష్మమైన అంశాల్లోనూ జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరమని రాజ్యసభ ముక్తకంఠంతో పేర్కొంది. ప్రజలు సహకరిస్తేనే ఈ ప్రమాదకర వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది.

లోక్‌సభ అభినందనలు
జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడం, అలాగే కరోనాను ఎదుర్కొనేందుకు పాటుపడుతున్న వైద్య సిబ్బంది, ఇతర రంగాలకు యావత్‌ దేశం ఆదివారం సాయంత్రం అభినందించడం వంటి అంశాలను లోక్‌సభ సోమవారం అభినందించింది. సభ్యులంతా లేచి చప్పట్లతో అభినందనలు తెలిపారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా