ఆర్థిక నేరగాళ్ల బిల్లుకు ఆమోదం

26 Jul, 2018 03:07 IST|Sakshi

ఇక నేరస్తులెవరూ దేశం విడిచిపోరు: గోయల్‌

వంద కోట్ల కన్నా ఎక్కువ మోసం చేస్తేనే వర్తింపు  

న్యూఢిల్లీ: బడా ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ‘పరారీ ఆర్థిక నేరగాళ్ల బిల్లు–2018’ను లోక్‌సభ గత గురువారమే ఆమోదించగా, రాజ్యసభ బుధవారం ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్‌ గోయల్‌ మాట్లాడుతూ చట్టాలను తప్పించుకుని దేశాన్ని విడిచి పారిపోతున్న ఆర్థిక నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతోందనీ, దీనిని అడ్డుకోవాల్సి ఉందని అన్నారు. ప్రస్తుత చట్టాలతో ఆ పనిని సమర్థంగా చేయలేకపోతున్నామన్నారు.

వంద కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో మోసం చేసిన వ్యాపారవేత్తలకే ఈ బిల్లులోని నిబంధనలు వర్తిస్తాయి. ‘నేరగాళ్లు పారిపోకుండా ఆపేందుకు సమర్థమైన, వేగవంతమైన, రాజ్యాంగబద్ధమైన విధానాన్ని ఈ బిల్లు ద్వారా తీసుకొచ్చాం’ అని గోయల్‌ తెలిపారు. ప్రస్తుత చట్టాల ప్రకారం నేరగాళ్లు కోర్టు ముందు హాజరుకానంత వరకు వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పటికే ఎన్నో చట్టాలు ఉన్నా ప్రభుత్వ సహకారంతోనే విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ వంటి ఆర్థిక నేరగాళ్లు దేశాలు దాటి తప్పించుకుపోయారని విపక్షాలు ఆరోపించాయి. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌లపై కాంగ్రెస్‌ సభ్యులు ఇచ్చిన సభా హక్కుల నోటీసులు తన పరిశీలనలో ఉన్నాయని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు