వేతన కోడ్‌కు రాజ్యసభ ఆమోదం

3 Aug, 2019 04:30 IST|Sakshi

ఉద్యోగులకు కనీస వేతనం అందేలా ఏర్పాట్లు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేసే ప్రతి కార్మికుడికీ కనీస వేతనం అందించేందుకు వీలు కల్పించే వేతనాల కోడ్‌ –2019 బిల్లును రాజ్యసభ ఆమోదించింది. వేతనాలు, బోనస్‌లకు సంబం ధించిన వివిధ నిబంధనలు, సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఇది చట్ట రూపం దాల్చితే దేశ వ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది కార్మికులకు లాభం కలుగుతుందని కార్మిక మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ సభలో తెలిపారు. సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 85 మంది, వ్యతిరేకంగా 8 మంది ఓటేశారు. కనీస వేతనాల చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్‌ చెల్లింపు చట్టం, సమాన ప్రతిఫలం చట్టం స్థానంలో ఇది అమల్లోకి రానుంది. ఈ బిల్లుకు లోక్‌సభ స్టాండింగ్‌ కమిటీ ప్రతిపాదిం చిన 24 సవరణల్లో 17 సవరణలను ప్రభుత్వం ఆమోదించిందని మంత్రి గంగ్వార్‌ తెలిపారు.

అయితే, కనీస జీవన పరిస్థితుల ఆధారంగా కనీస వేతనాలను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తీసుకోబోమన్నారు. కార్మిక సంఘాలు, యజమానులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే త్రిసభ్య కమిటీలే కనీస వేతనాలను నిర్ణయిస్తాయన్నారు. అదేవిధంగా, వేతనాల విషయంలో స్త్రీ, పురుష, ట్రాన్స్‌జెండర్లంటూ వివక్ష ఉండబోదన్నారు. వేతన పరిమితితో పనిలేకుండా అన్ని రంగాల కార్మికులకూ కనీస వేతనం సకాలంలో అందేలా నిబంధనలు పొందుపరిచామన్నారు. ప్రస్తుతం ఉన్న వేర్వేరు కార్మిక చట్టాలు వేతనానికి 12 రకాలైన నిర్వచనాలిచ్చాయని, దీంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. తాజా బిల్లుతో ఇటువంటి సమస్యలుండవన్నారు. జూలై 30వ తేదీన ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది.

మరిన్ని వార్తలు