సుష్మకు రాజ్యసభ నివాళి

7 Aug, 2019 11:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ దివంగత సీనియర్‌ నేత సుష్మా స్వరాజ్‌కు రాజ్యసభ నివాళులు అర్పించింది. సుష్మ మరణం దేశ రాజకీయాల్లో తీరని లోటు అని విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభలో మాట్లాడుతూ...ప్రజల గొంతుక వినిపించే శక్తివంతమైన పార్లమెంటేరియన్‌ సుష్మా స్వరాజ్‌ అని కొనియాడారు. ఆమె అకాల మరణం జాతికి తీరని లోటు అని పేర్కొన్నారు. ‘ ఆమె నన్ను అన్నా అని పిలిచేవారు. రాఖీ పౌర్ణమి రోజు నాకు రాఖీ కట్టేవారు. అందుకోసం నేనే స్వయంగా వారింటికి వెళ్లేవాడిని. అయితే ఇకపై రాఖీ పండుగ నాడు తానే మా ఇంటికి వస్తానని చెప్పారు. మీరు ఇప్పుడు అత్యున్నత పదవిలో ఉన్నారు. కాబట్టి నేనే వచ్చి రాఖీ కడతాను నాతో అన్నారు’ అంటూ సుష్మా స్వరాజ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని వెంకయ్యనాయుడు సభ్యులతో పంచుకున్నారు.

కాగా భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సుష్మా స్వరాజ్‌ గత రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె హఠాన్మరణంతో యావత్‌ దేశం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా బీజేపీ అగ్రనేతలు సుష్మా నివాసానికి చేరుకుని ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె భౌతికకాయం చూడగానే బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ భావోద్వేగానికి లోనయ్యారు. అద్వానీ, మోదీ సుష్మను గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టారు.

మరిన్ని వార్తలు