24 రాజ్యసభ సీట్లకు 19న ఎన్నిక

2 Jun, 2020 06:43 IST|Sakshi

వాయిదాపడిన 18 స్థానాలతోపాటు మరో 6 సీట్లకు ఎన్నికలు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా నిలిచిపోయిన రాజ్యసభలోని 18 స్థానాలతోపాటు మరో 6 సీట్లకు ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. 17 రాష్ట్రాలకు సంబంధించి 55 స్థానాలకు ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఫిబ్రవరి 25న ఎన్నికల ప్రకటన చేసింది. అభ్యర్థిత్వాల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం 37 మంది సభ్యులు పోటీ లేకుండా గెలిచినట్టు ఈసీ ప్రకటించింది. మిగతావి, ఆంధ్రప్రదేశ్‌లోని 4, గుజరాత్‌లోని 4, జార్ఖండ్‌లోని 2, మధ్యప్రదేశ్‌లోని 3, రాజస్తాన్‌లో 3, మణిపూర్, మేఘాలయల్లోని ఒక్కో స్థానం మొత్తం 19 సీట్లకు మార్చి 26న జరగాల్సిన ఎన్నికను కోవిడ్‌ కారణంగా వాయిదా వేసింది.

పరిస్థితులను సమీక్షించి ఈ 18 స్థానాలకు ఈ నెల 19వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యులు కుపేంద్ర రెడ్డి(జేడీఎస్‌), ప్రభాకర్‌ కోరె(బీజేపీ), ఎంవీ రాజీవ్‌ గౌడ(కాంగ్రెస్‌), బీకే హరిప్రసాద్‌ (కాంగ్రెస్‌)లు 25న∙రిటైరవుతుండగా, అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి ఎన్నికైన ముకుట్‌ మితి(కాంగ్రెస్‌) పదవీ కాలం జూన్‌ 23తో, మిజోరం ఎంపీ రొనాల్డ్‌ సపట్లౌ(కాంగ్రెస్‌) పదవీ కాలం జూలై 18తో ముగియనుంది. ఖాళీ కానున్న ఈ 6 స్థానాలకూ 19నే ఎన్నికలు జరపాలని ఈసీ నిర్ణయించింది.

మరిన్ని వార్తలు