గీత దాటితే వేటు ఎప్పుడు?

24 Nov, 2019 05:46 IST|Sakshi
రాకేష్‌ ద్వివేది

న్యూఢిల్లీ: మహారాష్ట్ర హైడ్రామాలో గీత దాటిన ఎన్సీపీ ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తింపుపై న్యాయనిపుణులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన అనంతరమే ఆ చట్టం వర్తిస్తుందని కొందరు.. ప్రమాణస్వీకారంతో సంబంధం లేకుండా జంపింగ్‌లపై చర్యలు తీసుకోవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. సీనియర్‌ న్యాయవాది, రాజ్యాంగ న్యాయ కోవిదుడు రాకేష్‌ ద్వివేది మాట్లాడుతూ.. ‘కొత్త ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఈ చట్టం వర్తించదు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్టసభల్లో ప్రమాణస్వీకారం చేయకముందే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రమాణస్వీకారం అనంతరం పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరతూ స్పీకర్‌కు ఫిర్యాదు చేయవచ్చు’ అని చెప్పారు. మరో సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారా? లేదా? అన్నది సమస్య కాదు. పార్టీ గీత దాటినవారికి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది’ అని అన్నారు. అజిత్‌ను సమర్థిస్తున్న ఎన్సీపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడింట రెండొంతులుంటే అనర్హత సమస్యే ఉత్పన్నం కాదని మరో లాయర్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు