‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం

9 Mar, 2019 02:32 IST|Sakshi

సామరస్యక పరిష్కారం కోసం సుప్రీంకోర్టు నిర్ణయం

చర్చల కోసం జస్టిస్‌ కలీఫుల్లా నేతృత్వంలో త్రిసభ్య కమిటీ

సభ్యులుగా శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరామ్‌ పంచు

8 వారాల్లో పూర్తి కావాలని గడువు

గోప్యంగా చర్చలు జరపాలని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు

న్యూఢిల్లీ/చెన్నై/బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దశాబ్దాలుగా నలుగుతున్న రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. రాజకీయంగా సున్నితమైన ఈ కేసులో మధ్యవర్తిత్వం వహించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ఫకీర్‌ మహ్మద్‌ ఇబ్రహీం కలీఫుల్లా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కోర్టు నియమించింది. ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు సీనియర్‌ న్యాయవాది, మధ్యవర్తిగా మంచి పేరు గడించిన శ్రీరామ్‌ పంచు ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉంటారు.

మరో వారంలో మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించి 8 వారాల్లో ముగించాలని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. అయోధ్యకు 7 కిలో మీటర్ల దూరంలోని ఫైజాబాద్‌లో మధ్యవర్తిత్వ చర్చలు జరుగుతాయనీ, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చూడాలని యూపీ సర్కార్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఈ చర్చలన్నీ చాలా రహస్యంగా జరుగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. చర్చలకు సంబంధించిన వివరాలు పత్రికల్లో, టీవీల్లో రాకూడదని తాము కోరుకుంటున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అవసరమనుకుంటే ఈ మధ్యవర్తిత్వ చర్చలపై వార్తలను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా పత్రికలు, టీవీ చానళ్లను నిలువరించేలా ఆదేశాలు ఇచ్చేందుకు జస్టిస్‌ కలీఫుల్లాకు కోర్టు అధికారం కల్పించింది.  

పురోగతిపై నాలుగు వారాల్లో నివేదిక..
మధ్యవర్తిత్వ చర్చలు ప్రారంభించిన తర్వాత వాటిలో ఎంత వరకు పురోగతి వచ్చిందో తెలుపుతూ చర్చలు మొదలు పెట్టిన నాలుగు వారాల్లో ఓ నివేదికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతించడంలో న్యాయపరమైన చిక్కులేమీ తమకు కనిపించలేదని పేర్కొంది. ‘మధ్యవర్తులుగా ఎవరు ఉండాలన్న దానిపై ఈ కేసులో భాగస్వామ్య పక్షాలు ఇచ్చిన సిఫారసులను మేం పరిశీలించాం. త్రిసభ్య కమిటీని నియమించాలని నిర్ణయించాం. అవసరమనుకుంటే మరికొందరిని ఈ కమిటీలో భాగం చేసుకునేందుకు ప్రస్తుత మధ్యవర్తులకు స్వేచ్ఛనిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం ప్రతిపాదన వచ్చినప్పుడు ముస్లిం సంస్థలు దానిని సమర్థించగా, నిర్మోహి అఖాడా మినహా మిగిలిన హిందూ సంస్థలన్నీ వ్యతిరేకించాయి.

అయితే మధ్యవర్తులుగా ఎవరు ఉండాలన్న దానిపై హిందూ సంస్థలు కూడా పేర్లను సిఫారసు చేశాయి. కాగా, చర్చల సమయంలో వివిధ భాగస్వామ్య పక్షాలు తెలిపే అభిప్రాయాలను అత్యంత రహస్యంగా ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో ఏమైన సమస్యలు ఎదురైనా మధ్యవర్తిత్వ కమిటీ చైర్మన్‌ సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి తెలియజేయవచ్చనీ, ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి ఏం కావాలో అడగొచ్చని కూడా న్యాయమూర్తులు తెలిపారు. అయోధ్యలో వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని నిర్మోహి అఖాడా, రామ్‌ లల్లా, సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌లకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. ఇక మధ్యవర్తిత్వంలో ఈ కేసు ఎంత వరకు తేలుతుందో వేచి చూడాల్సిందే.

ఆలయ నిర్మాణం జరగాల్సిందే: బీజేపీ
అయోధ్య అంశంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయాన్ని తాము గౌరవిస్తామనీ, అయితే రామాలయ నిర్మాణం ఒక్కటే ఈ కేసుకు పరిష్కారమని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉమా భారతి మాట్లాడుతూ ‘అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మేం కట్టుబడి ఉన్నాం. మసీదును ఆలయానికి దూరంగా ఎక్కడైనా కట్టుకోవచ్చు’ అని అన్నారు. ‘సమస్యను పరిష్కరించడం ముఖ్యమే. కానీ శ్రీరామ జన్మభూమి వద్ద గుడి కట్టడం మరింత ముఖ్యం. ఎక్కువ కాలం ఈ విషయాన్ని నాన్చడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు పేర్కొన్నారు. పిటిషన్‌దారుల్లో ఒకరైన సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ ఆలయ నిర్మాణం జరగకపోవడం అన్న ప్రశ్నే లేదనీ, వీలైనంత త్వరలో గుడి కట్టాలని బీజేపీ పట్టుదలతో ఉందని చెప్పారు.

కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాం: కాంగ్రెస్‌
అయోధ్య అంశంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం తెలిపింది. కేసు పరిష్కారానికి ఇదే చివరి ప్రయత్నం కావాలనీ, అన్ని పార్టీలు ఈ మధ్యవర్తిత్వంలో వచ్చే ఫలితానికి కట్టుబడి ఉండాలని ఆకాంక్షించింది. మతాలకు సంబంధించిన అంశాన్ని బీజేపీ గత 27 సంవత్సరాలుగా రాజకీయాలకు వాడుకుంటోందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఆరోపించారు. ఈ వివాదాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ 1992 నుంచి ప్రతీ ఎన్నికలోనూ లబ్ధి పొందుతోందనీ, ఎన్నికలు పూర్తవ్వగానే ఆ అంశాన్ని మరుగున పడేస్తోందని ఆయన మండిపడ్డారు.

రవిశంకర్‌కు చోటు విచారకరం
మధ్యవర్తిత్వం చేసే త్రిసభ్య కమిటీలో రవిశంకర్‌కు చోటు కల్పించడం విచారకరమని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఆయన తటస్థ వ్యక్తి కాదనీ, గతంలో ఈ అంశంపై రవిశంకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. ‘వివాదాస్పద స్థలంపై ముస్లింలు మొండిపట్టు పడితే ఇండియా కూడా సిరియాలా తయారవుతుందని రవిశంకర్‌ 2018 నవంబర్‌ 4న వ్యాఖ్యానించారు. ఆయన ఏ పక్షం తరఫున ఉన్నారో గతంలోనే చెప్పారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు మధ్యవర్తిగా పెట్టడం విచారకరం’ అని ఒవైసీ అన్నారు. అయితే ఈ కేసులో మధ్యవర్తిత్వాన్ని అనుమతించాలన్న కోర్టు నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని చెప్పారు.  

మధ్యవర్తులు ఎవరంటే..
జస్టిస్‌ కలీఫుల్లా
గతంలో ప్రఖ్యాత లాయర్‌గా పేరొందిన ఈయన 2016లో సుప్రీంకోర్టు జడ్జిగా 2016లో రిటైర్‌అయ్యారు. 2000 సంవత్సరంలో మద్రాసు హైకోర్టుకి శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. కశ్మీర్‌ హైకోర్టు సీజేగానూ చేశారు. 2012లో ఆయన సుప్రీం కోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. పదవిలో ఉండగా ఎన్నో చరిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. బోర్డు ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ (బీసీసీఐ)లో సంస్కరణల తీర్పు ప్రముఖమైనది. భారతీయ యూనివర్సిటీల్లో జాతకశాస్త్రంపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించే కోర్సులు ప్రవేశపెట్టడాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్పారు.

శ్రీశ్రీ రవిశంకర్‌
ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు,  ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు ప్రపంచవ్యాప్తంగా అనుచరులున్నారు. అయోధ్య సమస్య పరిష్కారానికి ఆయన 25 ఏళ్లుగా పని చేస్తున్నారు. ఎన్నో హిందూ, ముస్లిం సంఘాలతో మాట్లాడారు. 2017 సంవత్సరంలో ఆయన అయోధ్యలో పర్యటించి వివిధ వర్గాలతో, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపారు. సంక్షోభాలు నెలకొన్న దేశాల్లో ఆయన శాంతి స్థాపన కోసం అంబాసిడర్‌గా పనిచేశారు. కొలంబియా, ఇరాక్, ఐవరీకోస్ట్, బిహార్‌ల్లో వివాదాల పరిష్కారానికి ఇరుపక్షాలను ఒక్క చోటికి చేర్చి నేర్పుగా సంప్రదింపులు జరపడం ఆయనకు ఎనలేని పేరు తెచ్చింది.

శ్రీరామ్‌ పంచు
సీనియర్‌ న్యాయవాది అయిన శ్రీరామ్‌ పంచు మధ్యవర్తిత్వానికి మారుపేరు.  భారత న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వం అనే ప్రక్రియను ప్రవేశపెట్టింది ఆయనే. 2005లో తొలిసారిగా భారత్‌లో కోర్టు వ్యవహారాలకు సంబంధించి మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభించారు. అస్సాం, నాగాలాండ్‌ రాష్ట్రాల మధ్య 500 చదరపు కిలోమీటర్లకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి శ్రీరామ్‌ పంచుని సుప్రీంకోర్టు మధ్యవర్తిగా నియమించింది. దేశంలో అత్యంత కీలకంగా వ్యవహరించే మధ్యవర్తుల్లో శ్రీరామ్‌ పంచు ఒకరిగా గుర్తింపు పొందారు. బోర్డు ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ మీడియేషన్‌ ఇనిస్టిట్యూషన్‌కు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.  

జస్టిస్‌ కలీఫుల్లా,    శ్రీశ్రీరవిశంకర్‌,    శ్రీరామ్‌ పంచు

మరిన్ని వార్తలు