‘యోగాతో రాహుల్‌ పిల్ల చేష్టలకు చెక్‌’

21 Jun, 2019 16:32 IST|Sakshi

తిరువనంతపురం : అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యర్ధులపై రాజకీయ విమర్శలకూ వేదికైంది. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ సెటైర్లతో విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో రాహుల్‌ ఫోన్‌ చూస్తూ గడపడాన్ని రాం మాధవ్‌ పరోక్షంగా ప్రస్తావించారు.

పార్లమెంట్‌లో కొంతమంది పిల్లలు ఉన్నారని, యోగా అభ్యసించడం ద్వారా వారు తమ పిల్ల చేష్టలను అధిగమించవచ్చని రాహుల్‌ను ఆయన ఎద్దేవా చేశారు. క్లాస్‌ రూంలో ఉపాధ్యాయుడు చెప్పే విషయాలపై దృష్టి కేంద్రీకరించడం కొందరికి కష్టం కావచ్చు..పరీక్షల సమయంలో పాఠ్యపుస్తకాలపై మనం దృష్టి సారించలేకపోవచ్చు.. అంటూ అయితే  వీటికోసం చింతించాల్సిన అవసరం లేదని, స్కూళ్లలో చిన్నారులు ఉన్నట్టే మన పార్లమెంట్‌లోనూ పిల్లలు ఉన్నారని రాహుల్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యానించారు.

పార్లమెంట్‌లో పిల్లలు మన రాష్ట్రపతి ప్రసంగాన్నే ఆలకించరని, వారు తమ మొబైల్‌ ఫోన్లలో మెసేజ్‌లు చెక్‌ చేసుకంటూ వీడియో గేమ్‌లు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారని చురకలు అంటించారు. వారి చిన్నపిల్లల మనస్తత్వాన్ని యోగాతో నియంత్రించుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు.

మరిన్ని వార్తలు