నీతిమంతమైన నాయకుల్లా ఉండాలి

1 Nov, 2018 03:41 IST|Sakshi

సీబీఐ అధికారులకు కోవింద్‌ సూచన

న్యూఢిల్లీ: సీబీఐ, ఆర్‌బీఐ వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో ఆయా సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు నీతిమంతమైన నాయకుల్లా ఉండాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హితవు పలికారు. విజిలెన్స్‌ వారోత్సవాల సందర్భంగా కేంద్ర నిఘా కమిషన్‌ (సీవీసీ) ఏర్పాటు చేసిన సమావేశంలో కోవింద్‌ బుధవారం మాట్లాడారు. ‘ఇక్కడ ఉన్న వాళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలకు చెందిన అత్యున్నతాధికారులు, ప్రభుత్వాధికారులు కూడా ఉన్నారు. చిత్తశుద్ధి, పారదర్శకత, నిజాయితీ అనే పదాలకు లోతైన అర్థాలను మీరంతా అర్థం చేసుకోవడం ముఖ్యం. మీ ప్రవర్తన మీ సంస్థల్లోని వేలాది మంది ఉద్యోగులకు స్ఫూర్తినివ్వాలి. మీ పని, నైతిక విలువలు కోట్లాది మంది పౌరుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. నిజానికి మీరంతా నీతిమంతమైన నాయకుల్లా ఉండాలి’ అని కోవింద్‌ కోరారు.  

అలోక్, అస్థానాలకు త్వరలో సమన్లు
సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాలకు త్వరలోనే సమన్లు జారీచేసే అవకాశముందని కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరి బుధవారం తెలిపారు. మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీ కేసులో ముడిపుల స్వీకరణకు సంబంధించి వీరి వాంగ్మూలాలు నమోదుచేయొచ్చని వెల్లడించారు.

మరిన్ని వార్తలు