-

గుర్మీత్‌ శిక్ష నేపథ్యంలో కనిపిస్తే కాల్చివేత ఆర్డర్‌

28 Aug, 2017 09:37 IST|Sakshi
కనిపిస్తే కాల్చివేత.. రూమర్లు నమ్మొద్దు
రోహ్‌టక్‌:రేప్‌ కేసులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు నేడు శిక్షలు ఖరారు కానున్న నేపథ్యంలో పంచకుల, సిస్రా తరహా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హర్యానా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు రోహ్‌టక్ జిల్లా కలెక్టర్‌ అతుల్‌ కుమార్  ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఉన్నత స్థాయి భేటీ అనంతరం ఈ నిర్ణయం వెల్లడించారు.
 
‘రోహ్‌టక్‌లో ఎవరైనా సరే శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే ముందు హెచ్చరిక జారీ చేస్తాం. అయినా కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఎవరికైనా హని తలపెట్టినా, ఆత్మహత్యాయత్నం లాంటివి చేసినా కాల్చివేయటం జరుగుతుంది. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాం’ అని అతుల్‌ తెలిపారు. హైకోర్టు సూచనల మేరకే తాము నడుచుకుంటామని ఆయన అన్నారు. 
 
ఇక గుర్మీత్‌ ఉన్న సునారియ జైలు చుట్టుపక్కల మొత్తం 23 పారామిలటరీ భద్రత దళాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అతుల్‌ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు కూడా బయటికి రావొద్దని, మీడియాకు కూడా పలు సూచనలు చేశామని ఆయన చెప్పారు. హెలికాఫ్టర్ ద్వారా న్యాయమూర్తి జగ్దీప్‌ సింగ్‌ జైలుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నాం 2 గంటల 30 నిమిషాల సమయంలో తీర్పు వెలువడే అవకాశం ఉందని సమాచారం. 
 
 
ఆ వార్త నిజం కాదు: ఢిల్లీ పోలీసు శాఖ
 
న్యూఢిల్లీ: రామ్‌ రహీమ్‌ సింగ్‌ శిక్ష ఖరారు నేపథ్యంలో ఢిల్లీలో అలర్ట్ ప్రకటించిన విషయాన్ని ఢిల్లీ పోలీస్‌ శాఖ ఖండించింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారని, ట్రాఫిక్‌ను దారి మళ్లీంచారని వాట్సాప్‌ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్‌ పీఆర్‌వో మధుర్‌ వర్మ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. 
 
సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలంతా ఉత్తవేనని మధుర్‌ తేల్చేశారు. అయితే అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం మాత్రం చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక మీడియాపై దాడుల నేపథ్యంలో వారికి పోలీసులతో రక్షణ కల్పించినట్లు మధుర్‌ తెలిపారు.
మరిన్ని వార్తలు