వివాదాస్పద స్థలంలో భారీ ఆలయం!

17 Aug, 2019 04:06 IST|Sakshi

‘అయోధ్య’పై సుప్రీంకోర్టులో వాదించిన రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ తరఫున లాయర్‌

న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో బాబ్రీమసీదు నిర్మాణం కన్నా ముందు ఒక భారీ హిందూ దేవాలయం విలసిల్లిందని రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ తరఫు న్యాయవాది శుక్రవారం సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఆ దేవాలయం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినదన్నారు. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థల వివాదంపై సుప్రీంకోర్టు  ధర్మాసనం ప్రతీరోజు విచారిస్తుండటం తెల్సిందే. ప్రస్తుత వివాదాస్పద ప్రాంతాన్ని 1950లో పరిశీలించిన కోర్టు కమిషనర్‌ నివేదికను, పురాతత్వ శాఖ నిర్ధారించిన అంశాలను తన వాదనకు సమర్ధనగా రామ్‌లల్లా తరఫు లాయర్‌ వైద్యనాథన్‌ కోర్టుకు చూపించారు. మండపంతో కూడిన పెద్ద దేవాలయం ఉందని పురాతత్వ శాఖ నిర్ధారించిందన్నారు.

అది రామాలయమే అనేందుకు స్పష్టమైన సాక్ష్యాలేవీ లేవన్నారు. శివుడితో సహా పలువురి దేవుళ్ల చిత్రాలు అక్కడి గరుడ స్తంభాలపై చెక్కి ఉన్నాయని, అలాంటివి మసీదులపై ఉండవని ఆయన వాదించారు. ‘బాబ్రీమసీదు నిర్మాణానికి ముందు అక్కడ నిర్మాణం ఉందనే విషయం మాకు ముఖ్యం కాదు.. అది దేవాలయమా? కాదా? అన్నదే ముఖ్యం’ అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘అక్కడ ఒక సమాధి కూడా ఉంది కదా! దానిపై ఏమంటారు?’ అని వైద్యనాథన్‌ను ప్రశ్నించింది. దాంతో, ‘ఆ సమాధి దేవాలయ అనంతర కాలానికి సంబంధించినద’ని ఆయన సమాధానమిచ్చారు. తవ్వకాల్లో పై భాగంలో సమాధి ఆనవాళ్లు ఉన్నాయని, అవి తవ్వకాల్లోని లోతైన భాగాల్లో లేవని వివరించారు.

>
మరిన్ని వార్తలు