తెరపైకి రామ మందిరం!

19 Mar, 2017 01:28 IST|Sakshi
తెరపైకి రామ మందిరం!

లక్నో: యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ ఎంపికతో రామ జన్మభూమిలో మందిర నిర్మాణం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. పలు వేదికలపై యోగి రామ మందిర నిర్మాణం చేపట్టి తీరతామని బహిరంగంగానే ప్రకటించటం.. యాదృచ్ఛికంగా అదే వ్యక్తి సీఎంకానుండటంతో ‘అయోధ్య’పై హిందువుల్లో ఆశలు పెరిగాయి. 2014 బీజేపీ మేనిఫెస్టోలోనూ రామమందిర అంశం ప్రముఖంగా ఉంది. తాజా ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని చేర్చినా అభివృద్ధి ఎజెండాతోనే బీజేపీ ప్రచారం చేసింది. ప్రముఖులను పక్కనపెట్టి యోగిని హఠాత్తుగా తెరపైకి తీసుకోవటం వెనక కచ్చితమైన కారణం అంతుచిక్కటం లేదు.

అయితే కొత్త సీఎంను.. 2019 ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ఎంపిక చేయనున్నట్లు పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక వారం రోజులు తీవ్ర తర్జన భర్జనలు జరిపిన అనంతరం హిందుత్వ ఐకాన్‌గా పేరున్న ఆదిత్యనాథ్‌ను సీఎంగా ఎంపిక చేసింది. ఇదంతా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హిందువుల ఓటును ఆకర్శించేందుకే అయిఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఆరెస్సెస్‌ మూలాలున్న కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ శర్మలను కాకుండా అసలు ఆరెస్సెస్‌ వాసనలేమీ లేని ఖట్టర్‌ హిందూనేత ఆదిత్యను ఎంపిక చేశారనుకుంటున్నారు. ప్రస్తుతానికి మందిర నిర్మాణం అంశం కోర్టు పరిధిలో ఉన్నా.. అడపాదడపా దీన్ని ప్రజలకు గుర్తుచేస్తూ వచ్చిన ఆదిత్య సీఎం అయితే.. మందిర నిర్మాణం తప్పక జరుగుతుందని హిందువులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు