రాముడికి రాజకీయాలతో సంబంధంలేదు..

6 Jan, 2016 19:49 IST|Sakshi
అయోధ్యలో రామ్ లాలా మందిరం కోసం వీహెచ్ పీ సిద్ధం చేసిన నమూనా(ఫైల్)

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరినాటికి అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని, ఆ మేరకు పనులు వేగిరమయ్యేలా జనవరి 9న ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటామని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి అన్నారు. బుధవారం ఢిల్లీలోని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆగస్ట్- సెప్టెంబర్ మాసాల్లో మందిర నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు.

'2017 ఏడాది ప్రారంభంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల్లో లబ్ది పొందేదుకే మందిర నిర్మాణాన్ని తెరమీదకు తెస్తున్నారా?' అని విలేకరులు ప్రశ్నించగా, సుబ్రమణ్యస్వామి బదులిస్తూ.. 'రాముడికి రాజకీయాలకు సంబంధం లేదు. అయోధ్యలో మందిర నిర్మాణం ప్రతి హిందువు ఆకాంక్ష. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయని ఆగితే, తర్వాత లోక్ సభ ఎన్నికలు అడ్డొస్తాయి. అందుకే ఈ అంశాన్ని ఎన్నికలతో ముడిపెట్టొద్దు' అన్నారు. మందిర నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు ఆగస్ట్- సెప్టెంబర్ లో విచారణకు వస్తుందని, కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే పనులు మొదలుపెడతామని స్వామి స్పష్టం చేశారు.

ఢిల్లీ యూనివర్సిటీ వేదికగా జనవరి 9 నుంచి రెండు రోజులపాటు నిర్వహించే 'శ్రీరామ్ జన్మభూమి టెంపుల్- ది ఎమర్జింగ్ సినారియో' సదస్సులో ఆలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాలు చర్చించనున్నారు. ఈ సదస్సులో 300 మంది పురాతత్వ శాస్త్రవేత్తలు, విద్యావంతులు, న్యాయనిపుణులు పాల్గొంటారు. కాగా, ఈ సదస్సును ఢిల్లీ వర్సిటీలో నిర్వహించడంపై పలు విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారు.

మరిన్ని వార్తలు