సెప్టెంబర్‌ నుంచి రామగుండం ఎరువుల ఉత్పత్తి! 

13 Jun, 2020 02:14 IST|Sakshi

కేంద్రమంత్రి మాండవీయ

సాక్షి, న్యూఢిల్లీ: రామగుండం ఎరువులు, రసాయనాల కర్మాగారం(ఆర్‌ఎఫ్‌సీఎల్‌) సెప్టెంబరు నెలాఖరు నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి మన్‌ సుఖ్‌ మాండవీయకు సంబంధిత అధికారులు నివేదించారు. దేశంలోని ఐదు ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ ప్రక్రియపై మంత్రి ఆ శాఖ అధికారులతో కలసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గోరఖ్‌ పూర్, బరౌనీ, సింధ్రీలోని హిందూస్తాన్‌ ఉర్వరక్‌ రసాయన్‌ లిమిటెడ్‌ ప్లాంట్లు, రామగుండం ఎరువులు రసాయనాల సంస్థ, తాల్చేర్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ ప్లాంట్లపై సమీక్ష జరిగింది. కర్మాగారాల ఆర్థిక ప్రగతి, ఇతర అభివృద్ధి అంశాలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కర్మాగారాల పునరుద్ధరణ పనులను సత్వరం పూర్తి చేసేందుకు సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రామగుండం ఎరువుల రసాయనాల కర్మాగారం అభివృద్ధి పనులు ఇప్పటికే 99.53% పూర్తయ్యాయని, కరోనా వైరస్‌ సంక్షోభం తలెత్తిన కారణంగా కొన్ని చిన్న పనుల్లో కాస్త జాప్యం జరిగిందని ఈ సమావేశంలో అధికారులు మంత్రికి తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరుకల్లా రామగుండం ప్లాంట్‌లో ఎరువుల ఉత్పాదన మొదలవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. అలాగే గోరఖ్‌పూర్‌ ఎరువుల కర్మాగారం పనులు 77%, సింధ్రీ ప్లాంట్‌ పనులు 70%, బరౌనీ కర్మాగారం పనులు 69% పూర్తయ్యాయని అధికారులు వివరించారు. గోరఖ్‌ పూర్, సింధ్రీ, బరౌనీ ప్లాంట్లు వచ్చే ఏడాది మే నెలలోగానే పూర్తవుతాయన్నారు. ఒడిశాలోని తాల్చేర్‌ ఎరువుల కర్మాగారంలో ప్రస్తుతం ప్రాజెక్టు అవకాశాలపై అంచనా, డిజైన్ల రూపకల్పన పని కొనసాగుతోందని చెప్పారు.  

మరిన్ని వార్తలు