మోదీ పాలనకు రిఫరెండం కాదు..

6 Nov, 2018 16:48 IST|Sakshi
చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ (ఫైల్‌ఫోటో)

రాయ్‌పూర్‌ : చత్తీస్‌గఢ్‌లో వరుసగా నాలుగోసారి బీజేపీ ప్రభుత్వమే కొలువుతీరుతుందని ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌కు రిఫరెండంగా చూడటం సరికాదన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై కొద్దిపాటి ప్రభావం చూపుతాయని అంగీకరించారు.

కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ప్రకటించిన రైతు రుణాల మాఫీ హామీ అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. రైతులకు ఇప్పటికే వడ్డీరహిత రుణాలను అందచేశామన్నారు. వ్యవసాయ రంగంలో, ప్రజాపంపిణీ విభాగంలో తాము చేపట్టిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో తమ ప్రభుత్వం పట్ల సానుకూల పవనాలు వీస్తున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

మరోవైపు 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్న క్రమంలో రమణ్‌సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని విపక్షాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు