అది రామసేతువే!

14 Dec, 2017 01:50 IST|Sakshi

మానవ నిర్మితమేనని పరిశోధించి వెల్లడించిన సైన్స్‌ చానల్‌

కాంగ్రెస్‌పై విమర్శలు ప్రారంభించిన బీజేపీ  

‘రామసేతు’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీరాముడు వానర సేన సాయంతో నిర్మించాడన్న వాదన ఒకవైపు.. వేల సంవత్సరాలుగా భూ పలకల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన సహజ సిద్ధ నిర్మాణమన్న వాదన మరోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో.. అమెరికాకు చెందిన సైన్స్‌ చానెల్‌ ఒకటి మొదటి వాదననే సమర్ధిస్తూ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పలువురు భూగర్భ, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ.. ఆ నిర్మాణం సహజసిద్ధమైనది కాదని, మానవ నిర్మితమైనదేనని తేల్చింది. వివాదం పూర్వాపరాలతో కథనం..  

రామాయణంలో ఉన్నట్లుగా తమిళనాడులోని పంబన్, శ్రీలంకలోని మన్నార్‌ దీవుల మధ్య దాదాపు 50 కిలో మీటర్ల దూరంపాటు సముద్రంలో నిజంగా శ్రీరాముడు వంతెన నిర్మించాడా? రామసేతువు, ఆడమ్‌ బ్రిడ్జి అని రెండు పేర్లు కలిగిన ఈ మార్గం సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడిందా లేక మానవ నిర్మితమా అనే విషయాలు తాజాగా మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇందుకు కారణం అమెరికా డిస్కవరీ కమ్యూనికేషన్స్‌ సంస్థకు చెందిన ‘సైన్స్‌ చానల్‌’ రూపొందించిన ఓ కార్యక్రమం.

రామసేతువు నిజంగానే మానవ నిర్మితమేననడానికి ఆధారాలు ఉన్నాయని ఆ కార్యక్రమం చెబుతోంది. నాసా ఉపగ్రహాల చిత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించి తాము ఈ నిర్ధారణకు వచ్చామంది. ఆ ప్రాంతంలోని ఇసుక సహజసిద్ధంగా ఏర్పడినదే కాగా, దానిపై ఉన్న రాళ్లు మాత్రం కృత్రిమంగా తీసుకొచ్చి పేర్చినట్లు ఉన్నాయని అలన్‌ లెస్టర్‌ అనే భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఈ కార్యక్రమంలో చెబుతున్నారు. రామసేతువును దాదాపు 5 వేల ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారనీ, ఇది మానవుల అద్భుత నిర్మాణమని కార్యక్రమంలో సైన్స్‌ చానల్‌ పేర్కొంది. రామ సేతువు ప్రాంతంలో ఉన్న రాళ్లు 7 వేల ఏళ్ల పురాతనమైనవి కాగా, ఇసుక మాత్రం అంత పాతది కాదని తమ పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్త చెల్సియా రోస్‌ చెప్పారు.

ఐసీహెచ్‌ఆర్‌ ద్వారా పరిశోధన
రామసేతువు నిర్మాణానికి కారణమైన ద్వీపాలు చారిత్రకంగా ఉన్నాయా లేక మానవనిర్మితాలా అన్న అంశాన్ని పరిశోధించే బాధ్యతను గతంలో భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసీహెచ్‌ఆర్‌)కు అప్పగించారు. ప్రస్తుతం ఈ పరిశోధన కొనసాగుతోంది.

సేతు సముద్రం ప్రాజెక్టు భవితవ్యం గురించి ప్రభుత్వం చేసే ఆలోచనలపై తమ పరిశోధన ప్రభావం చూసే అవకాశం ఉందని ఈ ఏడాది మార్చి నెలలో ఐసీహెచ్‌ఆర్‌ చైర్మన్‌ వై. సుదర్శన్‌రావు అభిప్రాయపడ్డారు. రామసేతువు సహజసిద్ధమైనదా లేదా మానవనిర్మితమా అన్నది నిర్ధారించే అంశాలపై తాము దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. అయితే చరిత్రలోని క్రీ.పూ 4,000– క్రీ.పూ 1,000ల మధ్య కాలాన్ని ‘డార్క్‌ పీరియడ్‌’గా పరిగణిస్తున్నట్టు, అందువల్లే ఈ కాలాన్ని మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు.

కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
సైన్స్‌ చానల్‌ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలు మొదలుపెట్టింది. ఇందుకు కారణం గతంలో యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన వివరాలే. ప్రస్తుతం నౌకలు దేశ తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి రావాలంటే శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తోంది. అందుకు కారణం రామసేతువు వంతెన ఉన్నట్లుగా భావిస్తున్న ప్రాంతంలో సముద్రం ఎక్కువ లోతు లేకపోవడమే. ఆ ప్రాంతంలో మట్టిని తవ్వి, సముద్రాన్ని మరింత లోతుగా చేస్తే నౌకలు అక్కడ నుంచే రాకపోకలు సాగించవచ్చనీ, తద్వారా 350 నాటికల్‌ మైళ్ల దూరం, దాదాపు 30 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించవచ్చంటూ అప్పట్లో కాంగ్రెస్‌ ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

మిత్రపక్షం డీఎంకే వాదనతో కాంగ్రెస్‌ అంగీకరిస్తూ ‘అక్కడ వంతెన అనేదే లేదు. అది మానవనిర్మితం కాదు. ఒకవేళగతంలో ఎవరైనా దానిని నిర్మించి ఉంటే వారే దానిని నాశనం కూడా చేసి ఉండొచ్చు. రామసేతువు ఈ మధ్యే పూజ్యనీయ ప్రాంతంగా మారింది’ అని సుప్రీంకోర్టుకు చెప్పింది. అయితే ప్రజల విశ్వాసాలను గౌరవించాలని కాంగ్రెస్‌ నేత, న్యాయవాది కపిల్‌ సిబల్‌ నాడు సుప్రీంకోర్టులో అన్నారు. మరోవైపు సీతను రక్షించేందుకు ‘రామసేతువు’ మార్గాన్ని శ్రీరాముడు సృష్టించాడన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసమనీ, అందువల్ల ఆ మార్గంలో ఉన్న ద్వీపాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ గట్టిగా వాదించింది.

తాజాగా సైన్స్‌ చానల్‌ కథనం ఆధారంగా పలువురు బీజేపీ మంత్రులు కాంగ్రెస్‌పై విమర్శలు ప్రారంభించారు. ‘రామసేతువు అంశంపై బీజేపీ వైఖరి సరైనదేనని సైన్స్‌ ఛానల్‌ పరిశోధన నిరూపించింది. రామాయణంలో పేర్కొన్న మేరకు సీతను రక్షించేందుకు శ్రీరాముడు లంకకు వంతెనను నిర్మించాడనే ప్రజల విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ యూపీఏ పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన వారిప్పుడు మాట్లాడాలి. మన సాంస్కృతిక వారసత్వంలో రామసేతువు ఒక భాగం’ అని కేంద్ర మంత్రి రవిశంకర్‌ అన్నారు.      –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు