అందరూ హిందువులు కారు: అథవాలే

27 Dec, 2019 12:41 IST|Sakshi

ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయులంతా హిందువులే అనడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ మైదానంలో ఆరెస్సెస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది కార్యకర్తలు హాజరైన విషయం విదితమే. ఈ క్రమంలో మోహన్‌ భగవత్‌ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ... భారత్‌లో పుట్టిన వారంతా హిందువులేనని, మతాచారాలు, సంప్రదాయలు వేరైనా అందరం భరతమాత బిడ్డలమేనని వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్‌ దృష్టిలో 130 కోట్ల మంది భారతీయులు హిందువులేనని పేర్కొన్నారు. (చదవండి : భరతమాతను ఆరాధించేవారంతా హిందువులే)

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సామాజిక న్యాయ శాఖా మంత్రి రాందాస్‌ అథవాలే.. మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘భారతీయులంతా హిందువులేనని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఒకప్పుడు మన దేశంలో బుద్ధులు మాత్రమే ఉన్నారు. హిందుత్వ ఆవిర్భవించిన తర్వాతే మన దేశం హిందూ దేశంగా మారింది. నిజానికి భారత్‌లో ఉన్న వాళ్లంతా భారతీయులేనని మోహన్‌ భగవత్‌ చెప్పి ఉంటే బాగుండేది. మన దేశంలో బుద్ధులు, సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు, పార్శీలు, జైనులు, లింగాయత్‌లు ఉన్నారు. వేర్వేరు మత విశ్వాసాలు గల వారు ఇక్కడ నివసిస్తున్నారు’ అని పేర్కొన్నారు.  కాగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ స్థాపించిన రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు రాందాస్‌ అధ్యక్షుడన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా... మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఘాటుగా స్పందించారు. భారత్‌లో కేవలం ఒక మతం మాత్రమే ఉండాలని ఆరెస్సెస్‌ భావిస్తోందని.. అయితే అంబేద్కర్‌ రాజ్యాంగం అమల్లో ఉన్నంత వరకు అది సాధ్యం కాదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు