యోగిపై విసుగెత్తిన బాబా రాందేవ్‌ ఏం చేశారంటే..

6 Jun, 2018 09:19 IST|Sakshi
బాబా రాందేవ్‌ - యోగి ఆదిత్యనాథ్‌ (ఫైల్‌ ఫోటో)

లక్నో : యోగా గురు బాబా రాందేవ్‌, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విసుగెత్తిపోయారు. యోగి ఎన్నిరోజులకు కూడా తమ ప్రతిష్టాత్మకమైన ఫుడ్‌ పార్క్‌కు క్లియరెన్స్‌ ఇవ్వకపోవడంపై విసుగుచెందిన బాబా రాందేవ్‌, చివరికి తన ఫుడ్‌ పార్క్‌నే ఉత్తరప్రదేశ్‌ నుంచి తరలించేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో యమునా ఎక్స్‌ప్రెవేతో పాటు మెగాఫుడ్‌పార్క్‌ను నిర్మించాలనుకున్నారు. అయితే ఈ ఫుడ్‌ పార్క్‌ స్కీమ్‌ కోసం కేంద్రానికి సమర్పించాల్సిన అర్హత పత్రాలను కంపెనీ పొందలేకపోతుందని పతంజలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలక్రిష్ణ చెప్పారు. పేపర్‌ వర్క్‌ విషయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ పోతుందని పేర్కొన్నారు. ‘ ఈ ప్రాజెక్ట్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. క్లియరెన్స్‌ కోసం చాలా కాలంగా వేచిచూస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడి నుంచి తరలించాలని నిర్ణయించాం’ అని ఆచార్య బాలక్రిష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యామని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఈ విషయంలో చాలా జాప్యం చేస్తున్నారన్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని లక్షల మంది వ్యవసాయదారుల జీవన పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఏర్పాటయ్యే ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు కావాల్సిన మిషనరీని కంపెనీ ఇప్పటికే ఆర్డర్‌ చేసిందని, ఈ ప్రాజెక్ట్‌తో లక్షల కొద్దీ ఉద్యోగవకాశాలు సృష్టిస్తామని చెప్పారు.  కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రిత్వ శాఖ ప్రకారం ఢిల్లీకి దగ్గరిలో గౌతమ్‌ బుద్‌ నగర్‌లో ఫుడ్‌ అండ్‌ హెర్బల్‌ పార్క్‌ కోసం ఈ ఏడాది జనవరిలోనే తొలి ఆమోదం వచ్చేసింది. కానీ దీనికి కావాల్సిన భూమి, బ్యాంకు రుణానికి సంబంధించిన పేపర్లను కంపెనీ సమర్పించాల్సి ఉంది. తమ షరతులను చేరుకోవడానికి పతంజలికి ఒక నెల పొడిగింపు ఇచ్చామని, ఒకవేళ పతంజలి తమ షరతులను అందుకోలేకపోతే, రద్దు చేయడమే తప్ప.. తమ దగ్గర మరే ఇతర అవకాశం లేదని కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డిపార్ట్‌మెంట్‌ అధినేత జేపీ మీనా అన్నారు. ఈ నెల ఆఖరి వరకు కంపెనీకి సమయం ఉందన్నారు. 

>
మరిన్ని వార్తలు