సాధ్వికి రాందేవ్‌ మద్దతు

23 Apr, 2019 14:32 IST|Sakshi

డెహ్రడూన్‌: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భోపాల్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిని సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను యోగా గురువు రాందేవ్‌ వెనకేసుకొచ్చారు. అనుమానం పేరుతో ఆమెను తొమ్మిదేళ్ల పాటు జైలులో ఉంచడాన్ని ఆయన తప్పుబట్టారు. హరిద్వార్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘సాధ్వి ప్రజ్ఞా 9 ఏళ్ల పాటు కఠిన కారాగార జీవితం అనుభవించారు. జైల్లో అనుభవించిన బాధల కారణంగానే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరానికి పాల్పడ్డారన్న అనుమానంతో జైలులో ఆమె పట్ల అవమానవీయంగా ప్రవర్తించడం సమంజసం కాద’ని అన్నారు. ఐపీఎస్‌ అధికారి, ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్‌) మాజీ చీఫ్‌ హేమంత్‌ కర్కరేపై ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా రాందేవ్‌ పైవిధంగా జవాబిచ్చారు. తాను శపించినందునే హేమంత్‌ కర్కరే ఉగ్రకాల్పుల్లో హతమయ్యారని భోపాల్‌ బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యానించడంతో దుమారం రేగిన సంగతి తెలిసిందే.

రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగా దేశం ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటోందని రాందేవ్‌ పేర్కొన్నారు. ఈ సవాళ్లు అన్నింటినీ అధిగమించి 2040 నాటికి మన దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం మాత్రమే సమస్యలు కాదని.. ‘రాముడు, జాతీయవాదం’ కూడా ప్రధానాంశాలేనని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు