రాజ్యాంగ విలువలకు కట్టుబడదాం

27 Nov, 2019 03:31 IST|Sakshi
స్మారక నాణేన్ని విడుదల చేస్తున్న రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, స్పీకర్‌ బిర్లా

పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో రాష్ట్రపతి కోవింద్‌

పౌరులు బాధ్యతలు గుర్తెరగాలన్న ప్రధాని మోదీ

ప్రాథమిక బాధ్యతలను పాఠ్యాంశాల్లో చేర్చాలి: వెంకయ్య

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు. రాజ్యాంగ రచనకు 70 ఏళ్లయిన సందర్భంగా మంగళవారం ఢిల్లీలో ఏర్పాటైన పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ఏర్పరచిన మూడు (న్యాయ, శాసన, కార్యనిర్వాహక) వ్యవస్థలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు, పౌర సమాజ సభ్యులు, పౌరులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. రాజ్యాంగ విలువల ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పిన డాక్టర్‌ అంబేడ్కర్‌.. రాజ్యాంగాన్ని అత్యున్నతంగా భావించాలని తెలిపారన్నారు.  హక్కులు, విధులు నాణేనికి రెండు పార్శా్వల వంటివి అంటూ  బాధ్యతలు నెరవేర్చడం ద్వారానే హక్కులు సిద్ధిస్తాయన్న మహాత్ముని మాటలను  రాష్ట్రపతి గుర్తు చేశారు.  

బాధ్యతలపై దృష్టిపెట్టాల్సిన సమయం
హక్కుల కోసం కాకుండా.. విధులు, బాధ్యతలపై ప్రజలు దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.  సంయుక్త సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రజల హక్కులతోపాటు, బాధ్యతలనూ సుస్పష్టం చేయడం మన రాజ్యాంగం ప్రత్యేకతన్నారు.  బాధ్యతలను నిర్వర్తించకుండా హక్కులను కాపాడటం సాధ్యం కాదని స్పష్టం చేశారు.  

అవగాహన కల్పించాలి: వెంకయ్య  
పౌరుల ప్రాథమిక బాధ్యతల వివరాలను పాఠ్యాంశాల్లో చేర్చడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించి పౌరులకు అవగాహన కల్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.  మాతృభాషకు గౌరవం ఇవ్వడం ఎంతో అవసరమన్న ఉపరాష్ట్రపతి.. మాతృభాష మన దృష్టిలాంటిదైతే, ఇతర భాషలు కళ్లజోడు లాంటివని అభివర్ణించారు. అనంతరం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ  పార్లమెంటు సభ్యులు∙విధులను సమర్థంగా నిర్వర్తించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ 250వ సమావేశాలను పురస్కరించుకుని రూ.250 నాణేన్ని, రూ.5 విలువైన పోస్టల్‌ స్టాంపును రాష్ట్రపతి విడుదల చేశారు. ‘భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యసభ పాత్ర’అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి తొలి ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు. 

బహిష్కరించిన ప్రతిపక్షం
మహారాష్ట్రలో బీజేపీ అనుసరించిన వైఖరిని నిరస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌ సంయుక్త సమావేశాన్ని బహిష్కరించాయి. మొట్టమొదటి సారిగా శివసేన కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాలకు మద్దతుగా నిలిచింది.  ప్రతిపక్షాలు పార్లమెంట్‌ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహం నిరసన తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా