రమ్యా కంట నీరు...

20 Oct, 2015 09:36 IST|Sakshi
రమ్యా కంట నీరు...

శాండల్‌వుడ్ నటి, మాజీ ఎంపీ రమ్యా ఇటీవల తనపై వస్తున్న విమర్శలను కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణ వద్ద చెప్పుకుని కన్నీరు పెట్టారు. రాహుల్ పర్యటన సందర్భంలో బలవన్మరణానికి పాల్పడ్డ రైతు కుటుంబానికి కేపీసీసీ తరఫున అందజేసిన చెక్కు విషయంలో రమ్యాపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

 

ఈ విషయంలో తీవ్రంగా కలత చెందిన ఆమె సోమవారం మధ్యాహ్నం ఎస్.ఎం.కృష్ణ నివాసానికి చేరుకుని రైతు కుటుంబానికి అందజేసిన చెక్కు విషయంలో తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని వివరించినట్లు సమాచారం. అయితే తన రాజకీయ ప్రత్యర్థులు కావాలనే ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారని వాపోయారు.

 

ఈ పరిస్థితులన్నింటిని గమనిస్తుంటే అసలు తనకు రాజకీయాల నుంచే తప్పుకోవాలనే భావన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ మౌనంగా విన్న ఎస్.ఎం.కృష్ణ, రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజమేనని, అన్ని పరిణామాలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అనంతరం కన్నీటితోనే బయటికి వచ్చిన రమ్యా తనకు ఎమ్మెల్సీ కావాలనో లేదంటే మంత్రి పదవి చేపట్టాలనో ఏమాత్రం లేదని అన్నారు. సాధారణ భేటీలో భాగంగానే ఎస్.ఎం.కృష్ణతో సమావేశమైనట్లు చెప్పుకొచ్చారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా