కిక్కిరిసిన ఈద్గాలు

30 Jul, 2014 00:06 IST|Sakshi
కిక్కిరిసిన ఈద్గాలు

పింప్రి, న్యూస్‌లైన్ : పుణేలో రంజాన్ వేడుకలను మంగళవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రార్థనా స్థలాలకు తరలి వచ్చారు. స్థానిక ఈద్గా మైదానాల్లో ఉదయం 8, 9, 10 గంటలకు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనా స్థలాలు అల్లానామస్మరణతో మార్మోగాయి. పిల్లలు పెద్దలు అధిక సంఖ్యలో ఇక్కడకు చేరుకున్నారు.
 
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపేందుకు హిందువులు, క్రైస్తవులు ఈద్గా మైదానాల వద్ద బారులు తీరారు. గులాబీ పూలతో ఈద్ ముబారక్ అంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మతసామరస్యం వెల్లువిరిసింది. మావల్, తలేగావ్, వడగావ్, దేహూరోడ్, లోనావాలా పరిసరాలల్లో భారీ వర్షానికి ఈద్గా మైదానాలు అసౌకర్యంగా మారడంతో మసీదులల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు.
 
తలేగావ్ జామా మసీదు, మౌలానా సికందర్ ఎ ఆజామ్, హఫీజ్ కమ్యూమ్, మౌలానా షేక్ ప్రార్థనా మందిరాలల్లో మూడుసార్లు నమాజ్ చేశారు. ఎమ్మెల్యే బాలా భేగడే, జమా మసీదు ట్రస్టు చాంద్ సాబ్ సికిలకర్, మాజీ కార్పొరేటర్ బాబాలాల్‌నాలబంద్, నగర అధ్యక్షులు సులోచనా ఆవారే, ఉప నగర అధ్యక్షులు సత్యేంధ్ర రాజ్‌లు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. జామా మసీదు ట్రస్ట్, షేర్-ఎ-రఝూ యంగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్ ముబారక్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రూపాలేఖా దోరే, మనోజ్ డోరే, ట్రస్టు ప్రముఖులు యూనుస్ అనీస్ భాయి తాంబోలీ, అబ్దుల్ భాయి షేఖ్, రషీద్ సయ్యద్, యంగ్‌కమిటీ సదర్ మజహర్ షేక్, అమీర్ షేక్ తదితరులు పాల్గొన్నారు.

షోలాపూర్  : షోలాపూర్ పట్టణంతోపాటు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మైదానాలల్లో, వివిధ మసీద్‌లలో ప్రార్థనలు చేశారు. రంగ్ భవన్ చోక్ సమీపంలోని మైదానంలో మహిళలు కూడా ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు అలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు