రాణీ కీ ‘వావ్’..!

26 Sep, 2015 19:28 IST|Sakshi
రాణీ కీ ‘వావ్’..!

సాక్షి: పురాతన చరిత్ర, అత్యద్భుత కట్టడాలు కలిగిన అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటి. అద్భుతమైన శిల్పకళా చాతుర్యాన్ని మేళవించి నిర్మించిన అపూర్వ కట్టడాల్లో ‘రాణీ కీ వావ్’ ప్రసిద్ధి చెందింది. యూనెస్కో దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించింది. ఇలాంటి చారిత్రక కట్టడాలన్నింటిని మనం ప్రత్యక్షంగా వీక్షించలేక పోవచ్చు.. కానీ వాటి గురించి తెలుసుకోవలసిన బాధ్యత మనపై  ఉంది. ఎందుకంటే అదంతా మన దేశ  చారిత్రక సంపద. ఆ సంపద గురించి, దాన్ని కాపాడుకోవడంలో మనపై ఉన్న బాధ్యత గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ రోజు ‘రాణీ కీ వావ్’  గురించి తెలుసుకుందాం.
 
ఏమిటీ కట్టడం? ఉత్తర గుజరాత్‌లో ఉన్న ‘రాణీ కీ వావ్’. దీనినే క్వీన్స్ స్టెప్ వెల్ అని రాస్తారు. దీన్ని 11వ శతాబ్ధంలో ‘సోలంకి’ వంశీయులు నిర్మించారు. దీనిని డొవాగర్ రాణి ఆమె భర్త భీమ్‌దేవ్ 1 జ్ఞాపకంగా నిర్మించారు.

దీనికి ఎలా చేరుకోవాలి?.. గుజరాత్ నుంచి 130 కి.మీ ప్రయాణం చేస్తే పఠాన్ అనే చారిత్రక గ్రామానికి చేరుకోవచ్చు. ఈ గ్రామం అంతా ఒక పచ్చటి అడవిని తలపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద లోయలు, గుహలతో నిండి ఉంటుంది. పాములు కూడా మధ్యలో ప్రయాణానికి  అడ్డుపడుతూ ఉంటాయి.  ఈ గ్రామానికి రెండు కి.మీ దూరంలోనే ఈ రాణికీవావ్ కట్టడం ఉంటుంది.

దీని ప్రత్యేకతలు... ఇది భారతదేశంలోనే అత్యంత పెద్దదైన, పురాతన చారిత్రక కట్టడం. దీని చుట్టూ నాలుగు ప్రత్యేక విశాల మండపాలు.. దీనిని ఆనుకుని ఒక భూగర్భలోయ కట్టడం ఉంది. దాని లోతు వంద అడుగులు.  ఈ రాణీకివావ్ కట్టడాన్ని త్రిముఖీయంగా నిర్మించారు. అక్కడ ఉన్న ప్రతి చిన్న కట్టడం నగిషీలతో చెక్కబడింది. అరుదుగా దొరికే అనేక రకాల రాళ్లతో దీనికి మలిచారు. కేవలం చూడటానికి కంటికి ఇంపుగా ఉండటమే కాక ఈ ప్రదేశంలో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. పూర్వం సోలంకి వంశీయ రాజలు ఇక్కడకు సేదతీరడం కోసం వచ్చే వారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

మరో విశేషమేమిటంటే... ఈ కట్టడాన్ని 11 వ శతాబ్ధంలో నిర్మించినా దీన్ని గుర్తించింది మాత్రం కేవలం కొన్ని దశాబ్ధాల కిందట మాత్రమే.దీనిని 1987లో గుర్తించారు. దీనికి కారణం ఈ కట్టడం సరస్వతి నదీ సమీపంలో ఉండటం వల్ల.. ఆ నది అంతరించి పోయేసరికి ఈ కట్టడం  భూమిలో కూరుకుపోయింది. ఎవరి గుర్తుగా అయితే రాణి ఈ కట్టడాన్ని నిర్మించారో ఆయన అస్తిపంజరం ఇప్పటికీ ఈ కట్టడం ప్రాంగణంలో ఉంది.

మరిన్ని వార్తలు