కేంద్రం నిర్ణయంపై ఆశ్చర్యపోయా: సీజేఐ

3 Nov, 2018 09:12 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల నలుగురు జడ్జీల పదోన్నతులకు 48 గంటల్లోపే కేంద్రం అనుమతి ఇవ్వడం తనను చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ వ్యాఖ్యానించారు. సీజేఐ శుక్రవారం సుప్రీంకోర్టు వార్తలు రాసే పాత్రికేయుల ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి సహా వివిధ కోర్టుల నుంచి నలుగురు న్యాయమూర్తులు పదోన్నతిపై ఇటీవల సుప్రీంకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే.

‘గత నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ నలుగురు జడ్జీల ప్రమోషన్లపై మేం(కొలీజియం) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు పంపాం. అదే రోజు సాయంత్రమే ఆ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించినట్లు సమాచారం అందింది. నేను చాలా షాక్‌కు గురయ్యా. నేను నమ్మలేకపోయా. అదే విషయం అధికారులను కూడా అడిగా. మీ మాదిరిగానే నేనూ విస్మయానికి లోనయ్యా’ అని సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌ తెలిపారు. ‘ఈశాన్య ప్రాంతం నుంచి సీజేఐ అయిన మొదటి వ్యక్తిగా, 48 గంటల్లోపే జడ్జీల పదోన్నతులను కేంద్రంతో ఓకే చేయించి సృష్టించారు’ అని ఓ విలేకరి ప్రశ్నించగా సీజేఐ స్పందిస్తూ.. న్యాయశాఖ మంత్రి వద్దనే దీనికి సరైన సమాధానం ఉంటుందన్నారు.

కక్షిదారుల్లో ఇంగ్లిష్‌ తెలియని వారికి మాతృభాషల్లోనే సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను అందజేస్తుందని ఆయన తెలిపారు. సిబ్బంది, వనరుల కొరత కారణంగా ముందుగా హిందీతో ఈ దిశగా ప్రయత్నం ప్రారంభిస్తామన్నారు. నాలుగో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే తదుపరి సీజేఐ కానున్నారా అన్న ప్రశ్నకు ఆయన..ఆ విషయం కచ్చితంగా తానెలా చెప్పగలనన్నారు. ‘సోమ, శుక్రవారాల్లో పలు రకాల ఇతర కేసుల విచారణను చేపడతాం. అలాగే, ముగ్గురు సభ్యుల ధర్మాసనాల ఏర్పాటు ప్రస్తుతం అవసరం లేదు. దీనివల్ల కోర్టుల సంఖ్య పెరుగుతుంది’ అని సీజేఐ వివరించారు.   

మరిన్ని వార్తలు