సుప్రీం ఎదుట మహిళల ఆందోళన

8 May, 2019 03:21 IST|Sakshi

 సీజేఐకి అంతర్గత విచారణ కమిటీ క్లీన్‌చిట్‌ నేపథ్యంలో నిరసన 

పలువురు లాయర్లు సహా 55 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌పై మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక ఆరోపణలను విచారించేందుకు అమలు చేసిన ప్రక్రియ సరిగా లేదని పలువురు న్యాయవాదులతో కలిసి మహిళలు పెద్ద సంఖ్యలో సుప్రీంకోర్టు ఎదుట నిరసన తెలిపారు. ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీలతో కూడిన అంతర్గత విచారణ కమిటీ 14 రోజుల పాటు విచారణ జరిపి నివేదిక సమర్పించింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఆయనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేసే ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అయితే ఈ నివేదికను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ ఒక ఉత్తర్వులో తెలిపారు. ప్రధాన న్యాయమూర్తికి క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ అదే రోజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆ నిర్ణయం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. తాను భయపడుతున్నట్టుగానే జరిగిందని, ఓ భారతీయ మహిళగా తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. అంతకుముందు ఆమె త్రిసభ్య కమిటీ ఎదుట మూడుసార్లు విచారణకు హాజరయ్యారు. అనంతరం ఈ కమిటీతో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదంటూ విచారణ ప్రక్రియ నుంచి తప్పుకొన్నారు. కాగా, సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ సీజేఐకి క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై పలువురు మహిళలు, న్యాయవాదులు మంగళవారం సుప్రీంకోర్టు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ‘నో క్లీన్‌చిట్‌’, ‘చట్టాన్ని అందరూ గౌరవించాలి’, ‘నువ్వు ఎంత పెద్ద వాడివైనా కావొచ్చు.. కానీ నీకంటే చట్టం గొప్పది’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పోలీసులు పలువురు లాయర్లు, మహిళలుసహా మొత్తం 55 మందిని అదుపులోకి తీసుకుని మందిర్‌మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.

కమిటీ నివేదిక ఇవ్వండి: మాజీ ఉద్యోగిని
సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ నివేదిక ప్రతిని తనకు అందజేయాలని  మాజీ ఉద్యోగిని డిమాండ్‌ చేశారు. కమిటీకి నేతృత్వం వహించిన జస్టిస్‌ బాబ్డేకు ఆమె ఈ మేరకు లేఖ రాశారు. విచారణ బృందం పనితీరు పారదర్శకంగా లేదంటూ ఆమె.. విచారణ ప్రతిని తనకు ఇవ్వకపోవడం న్యాయ సూత్రాల ఉల్లంఘన, న్యాయవ్యవస్థను అవహేళన చేసినట్లే అవుతుందని పేర్కొన్నారు. మరోవైపు, అంతర్గత కమిటీ నివేదికను బహిర్గతపరచాలని మాజీ కేంద్ర సమాచార కమిషనర్‌ శ్రీధర్‌ ఆచార్యులు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు