నిర్భయ చట్టం అమల్లోకొచ్చినా.. భయమే!

6 Nov, 2019 01:16 IST|Sakshi

అభద్రతలో కొట్టుమిట్టాడుతోన్న 80 శాతం మంది భారతీయ స్త్రీలు

మహిళలు సేఫ్‌గా భావిస్తోన్న తొలి ఐదు రాష్ట్రాల్లో ఏపీ

మహిళలు సురక్షితంగా ఉన్నామని భావిస్తోన్న రాష్ట్రాల ర్యాంకింగ్‌లు...

యావత్‌ ప్రపంచం సిగ్గుపడేలా ఢిల్లీ నడివీధుల్లో నిర్భయపై జరిగిన అత్యాచారానికి మరో నెలరోజుల్లో ఏడేళ్ళు నిండుతాయి. నిర్భయ ఉదంతం ఈ దేశంలో స్త్రీల భద్రత అంశాన్ని తెరపైకి తెచ్చింది. నిర్భయ ఘటనపై వెల్లువెత్తిన యువతరం ఉద్యమం నిర్భయ చట్టానికి ప్రాణం పోసింది. పసివారిపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్‌ చిన్నారులపై అత్యాచారాల విషయంలో మరణదండన విధింపునకు దారితీసింది. అయితే ఏడేళ్ళ అనంతరం కూడా మహిళలు తమ రక్షణ విషయంలో సంతృప్తికరంగా లేరు. పాలనలో ప్రజల భాగస్వామ్యానికి సంబంధించిన ‘నేతా యాప్‌’ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలో దాదాపు 80 శాతం మంది స్త్రీలు తమ రక్షణ కోసం ప్రభుత్వం చేయాల్సినంత చేయడంలేదని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో వెల్లడైన అంశాలు మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో సంస్కరణల ఆవశ్యకతను, కఠినతరమైన చట్టాల అవసరాన్నీ నొక్కిచెపుతున్నాయని ఈ వేదిక వ్యవస్థాపకుడు ప్రథమ్‌ మిట్టల్‌ వ్యాఖ్యానించారు.

నేతా యాప్‌ ఒక లక్ష మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో 42 శాతం మంది తాము సురక్షితంగా లేమనీ, లేదా అత్యంత అభద్రతలో జీవిస్తున్నామనీ తెలిపారు. ప్రధానంగా హరియాణా, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలోని మహిళలు తాము ఎక్కువ అభద్రతకు లోనౌతున్నట్టు వెల్లడించారు. హిమాచల్‌ప్రదేశ్, త్రిపుర, కేరళలోని స్త్రీలు తమ పరిసరాల్లో తాము భద్రంగా ఉన్నట్లు వెల్లడించారు.  
దేశం మొత్తంమీద చూస్తే మెట్రోనగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు కనీస భద్రతలేని ప్రాంతమని సర్వేలో వెల్లడయ్యింది. సర్వేలో పాల్గొన్న 65 శాతం మంది మహిళలు కనీసం ఒక్క సారైనా తాము అభద్రతాభావ పరిస్థితులను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ఇతర మెట్రోనగరాలైన ముంబైలో ఇలాంటి రక్షణలేని పరిస్థితులను ఎదుర్కొన్న వారు 41 శాతం ఉంటే, కోల్‌కతాలో 50 శాతం, చెన్నైలో 38 శాతం మంది ఇలాంటి అభద్రతాభావంలో ఉన్నట్టు వెల్లడించారు.

మహిళల భద్రతకు భరోసా ఇస్తోన్న రాష్ట్రాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ తొలిస్థానంలోనూ, ఆ తరువాతి స్థానాలను త్రిపుర, కేరళ ఆక్రమించాయి. తాము సురక్షితంగా ఉన్నామని స్త్రీలు భావిస్తోన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ నాల్గవ స్థానంలో ఉంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో అతి తక్కువ మంది అంటే కేవలం 27 శాతం మంది మాత్రమే తాము సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో 61 శాతం మంది స్త్రీలు తాము అత్యంత సురక్షితంగా ఉన్నామని చెప్పడం విశేషం. అదేవిధంగా హరియాణా బాలబాలికల నిష్పత్తిలో కొంతమెరుగుపడినప్పటికీ పరువు హత్యలు, బాలికల శిశు హత్యల్లాంటి కొన్ని ప్రమాణాల్లో ఈ రాష్ట్రం అత్యంత వెనుకబడిఉన్నట్టు నేతా యాప్‌ సర్వే వెల్లడించింది.  

పాలనా వైఫల్యం...
ఢిల్లీ ప్రభుత్వం రాజధాని నగరం మొత్తంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు 500 కోట్ల రూపాయలను (70.7 మిలియన్‌లు)ఖర్చు చేసింది. అయితే కేవలం సీసీటీవీలను ఏర్పాటు చేయడం ఒక్కటే సరిపోదని ఢిల్లీ మహిళల్లో 83 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అత్యధికంగా హరియాణా మహిళలు (92 శాతం మంది) స్త్రీల రక్షణ విషయంలో తమ ప్రభుత్వ పాలన పట్ల అత్యంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు