ఐఏఎస్‌ అధికారిపై అత్యాచార ఆరోపణలు

4 Jun, 2020 12:31 IST|Sakshi

రాయ్‌పూర్ :  ఉన్న‌త‌మైన ప‌ద‌విలో ఉండి ప‌లువురికి ఆద‌ర్శంగా మెల‌గాల్సిన జిల్లా క‌లెక్ట‌రే వ‌క్ర‌బుద్ది చూపించాడని ఓ మహిళ ఆరోపించడం ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపింది. సాక్షాత్తూ క‌లెక్ట‌రేట్‌లోనే ఐఏఎస్‌ అధికారి త‌న‌పై అత్యాచారం చేశాడ‌ని ఓ మ‌హిళ ఆరోపించ‌డం పెను దుమారం రేపింది. వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌భుత్వ ఉద్యోగి అయిన త‌న భ‌ర్త‌ను డిస్మిస్ చేస్తానని బెదిరించి త‌న‌పై జంజ్‌గిర్-చంపా జిల్లా మాజీ క‌లెక్ట‌ర్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ జనక్‌ ప్రసాద్ పాథక్ అత్యాచారానికి పాల్పడ్డాడ‌ని 33 ఏళ్ల  మహిళ  బుధ‌వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నాళ్లుగా త‌న‌కు అశ్లీల సందేశాలు పంపిస్తూ లైంగింగా వేధిస్తున్నాడ‌ని, మే 15న త‌న‌పై క‌లెక్ట‌రేట్‌లోనే అత్యాచారం చేశాడ‌ని జిల్లా ఎస్పీ పారుల్ మాధూర్‌కు ఇచ్చిన‌ ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. పాథక్ తనకు పంపిన ఫోన్‌ సందేశాలు, ఫొటోలకు పోలీసులకు ఆమె అందజేశారు. 

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు న‌మోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన‌ట్లు ఎస్పీ పారుల్ తెలిపారు. నిందితుడిపై ఐపీసీ 376, 506, 509 బి సెక్షన్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అత్యాచార ఆరోప‌ణ‌లు రావ‌డంతో స‌ద‌రు క‌లెక్ట‌ర్ జ‌న‌క్ ప్ర‌సాద్‌ను ఛ‌త్తీస్‌గ‌డ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టరుగా మే 26న  ప్ర‌భుత్వం బ‌దిలీ  చేసింది. త‌న‌పై వ‌చ్చిన అత్యాచార ఆరోప‌ణ‌ల‌పై స్పందించేందుకు క‌లెక్ట‌ర్ అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు క‌లెక్ట‌ర్‌ని అరెస్ట్ చేయ‌క‌పోవ‌డంతో పెద్ద ఎత్తున మ‌హిళా సంఘాలు నిర‌స‌న‌లు చేప‌ట్టాయి.

మరిన్ని వార్తలు