'భర్త రేప్ చేసినా శిక్ష వేయాల్సిందే'

12 Mar, 2016 08:48 IST|Sakshi
'భర్త రేప్ చేసినా శిక్ష వేయాల్సిందే'

న్యూఢిల్లీ: భర్త కానీ ఇతరులు కానీ ఎవరు అత్యాచారం చేసినా నేరంగా పరిగణించాలని జాతీయ మహిళా సంఘం (ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలు రేఖా శర్మ డిమాండ్ చేశారు. భారతీయుల విషయంలో భార్యాభర్తల సంబంధాలను అత్యాచారంగా పరిగణించడం సరికాదని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంపై ఆమె స్పందించారు.

'మత విశ్వాసాల పేరిట భర్తలతో భార్యలు చిత్రహింసలు పడటాన్ని సహించలేం. జంతువుల పరిరక్షణకు కూడా చట్టాలు ఉన్నాయి. ఎవరు అత్యాచారం చేసినా అత్యాచారమే. భర్త అయినా మరొకరయినా ఒకే శిక్ష వేయాలి' అని రేఖా శర్మ ట్వీట్ చేశారు. భారతీయుల విషయంలో భార్యాభర్తల మధ్య అత్యాచార ఘటనగా పరిగణించలేమని రాజ్యసభలో కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా వివాహ సంబంధిత అత్యాచార ఘటనలను నేరంగా పరిగణిస్తున్నారని, వ్యతిరేకంగా చట్టాలున్నాయని, మన దేశంలో ప్రత్యేకత ఎందుకని రేఖా శర్మ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు