అత్యాచారం ఓకే కానీ.. రోటీ కాదా?

25 Jul, 2014 08:43 IST|Sakshi
అత్యాచారం ఓకే కానీ.. రోటీ కాదా?

ప్రతిపక్షాలపై ‘సామ్నా’లో శివసేన ఎదురుదాడి

సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో రోటీ అంశంపై శివసైనికుల చర్య సరికాదని చెప్పేవారికి.. బెంగళూరు స్కూల్‌లో ఓ ముస్లిం వ్యక్తి పవిత్ర రంజాన్ మాసంలో ఓ చిన్నారిపై అత్యాచారం జరపడం సరైనదిగా కనిపిస్తోందా అని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ప్రశ్నించారు.

క్యాంటీన్‌లో ఆహారం సరిగా లేకపోవడంపై నిరసన తెలిపే సందర్భంలో జరిగిన ఘటనకు కొన్ని పార్టీలు మతం రంగు పూసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మహారాష్ట్ర సదన్‌లో ఓ ముస్లిం ఉద్యోగికి శివసేన ఎంపీ రాజన్ విచారే బలవంతంగా రోటీ తినిపించి రోజా (ఉపవాసానికి)కు భంగం కలిగేలా వ్యవహరించినట్లు కనిపించిన వీడియోను తప్పుపట్టిన ప్రతిపక్షాలు.. ముస్లిం వర్గాలపై శివసేన జులుం చలాయిస్తోందని దుయ్యబట్టాయి.
 
ఈ నేపథ్యంలో గురువారం ‘సామ్నా’ పత్రిక సంపాదకీయంలో ఉద్ధవ్ ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా స్పందించారు. ‘మహారాష్ట్ర సదన్ కాంట్రాక్టర్ ఏ మతానికి చెందినవారన్నది ఆయన ముఖంపై రాసి ఉండదు కదా.. అయినా శివసైనికులు ఒక ముస్లిం వ్యక్తిని రోజా విరమించేలా చేశారని తప్పుడు ప్రచారం మొదలుపెట్టి మా పార్టీకి చెడ్డపేరు తేవాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోం.. ముఖ్యంగా మీరు గొడవకు దిగుతున్న ది శివసేనతో అన్నది గుర్తుపెట్టుకోండి’అంటూ ఉద్ధవ్ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు