‘రేప్ సర్వైవర్’ జోర్డాన్ మృతి

13 Mar, 2015 16:10 IST|Sakshi
‘రేప్ సర్వైవర్’ జోర్డాన్ మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా గర్జించి మమతా బెనర్జీ ప్రభుత్వం వెన్నులో దడ పుట్టించిన సుజెట్టే జోర్డాన్ గళం మూగబోయింది. ‘పార్క్ స్ట్రీట్ రేప్ విక్టమ్’గా ముద్రపడిన 40 ఏళ్ల జోర్డాన్  మూడు రోజుల క్రితం అనారోగ్యం వల్ల నగరంలోని ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం ఉదయం ఆమె మరణించినట్టు నగర జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) పల్లబ్ కాంతి ఘోష్ తెలియజేశారు. ఆమె శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతినడం వల్ల ఆమె చనిపోయినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అంతకుమించి వివరాలు వారు వెల్లడించలేదు.


 2012, ఫిబ్రవరి ఆరో తేదీన జోర్డాన్‌ను ఐదుగురు మృగాలు తుపాకీతో బెదిరించి కారులో ఎక్కించుకొని నడుస్తున్న కారులోనే ఆమెపై అత్యాచారం జరపడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్క్ స్ట్రీట్‌లో ఆమెపై అత్యాచారం జరిగినందున ‘పార్క్ స్ట్రీట్ రేప్ విక్టిమ్’గా ఆమెకు ముద్రపడింది.


ఆమెపై జరిగిన అత్యాచార సంఘటన పట్ల అప్పట్లో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగగా, ‘అదంతా ఓ కట్టుకథ’ అంటూ మమతా బెనర్జీ కొట్టివేశారు. ఓ వేశ్య, విటుల మధ్య జరిగిన గొడవ కారణంగా రేప్ జరిగిందంటూ తృణమూల్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తిదార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మహిళా, మానవ హక్కుల సంఘాల కార్యకర్తలను ఉద్యమబాట పట్టించాయి. దాంతో సమగ్ర దర్యాప్తునకు మమతా బెనర్జీ దిగిరాక తప్పలేదు. ఆ కేసులో ఐదుగురు నిందితులకుగాను ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సహా మరో నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉన్నారు.


ఆ తర్వాత కూడా బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై రేప్‌లు కొనసాగడంతో 2013లో సుజెట్టే జోర్డాన్ మీడియా ముందుకు వచ్చి తన పేరు వివరాలను బయటబెట్టారు. ఇద్దరు పిల్లలు కలిగిన ఆమె రేప్ జరిగినప్పటి నుంచి ఉద్యోగం కోసం ఏడాదిపాటు ఎన్ని కష్టాలు అనుభవించింది వివరించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా ఎన్జీవో సంస్థలతో కలిసి ఎన్నో ఆందోళనలు చేశారు. రేప్ బాధితుల కోసం ఓ హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటుచేసి జరిగిన సంఘటనకు కృంగిపోకుండా  సమాజాన్ని ఎదురించి ఎలా బతకాలో కౌన్సిలింగ్ చేస్తూ వచ్చారు. ‘రేప్ విక్తిమ్’గా సంబోధిస్తే ఆమె అంగీకరించేవారు కాదు. ‘రేప్ సర్వైవర్’గా పిలవాలని సూచించేవారు.

మరిన్ని వార్తలు