అమానుష ఘటనపై రతన్ టాటా ఆవేదన

4 Jun, 2020 08:16 IST|Sakshi

న్యాయం జరగాల్సిందే : రతన్ టాటా 

మనుషుల  దారుణ హత్యల కంటే తక్కువేమీ కాదు

సాక్షి, ముంబై:  ఆకలితో ఉన్న ఏనుగుకు  పైనాపిల్ బాంబు ఆహారంగా ఇచ్చిన అమానుష ఘటనపై  ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా స్పందించారు. కేరళ రాష్ట్రంలో గర్భిణీ ఏనుగును దారుణంగా చంపడాన్ని ఖండిస్తూ ఆయన సోషల్ మీడియాలో కదిలించే పోస్ట్ పెట్టారు. మూర్ఖత్వంతో మూగజీవి ప్రాణం తీసిన  వైనంపై తీవ్ర ఆవేదన  వ్యక్తం చేశారు. (ఏనుగు నోట్లో పైనాపిల్‌ బాంబ్‌)

"ఈ ఘటన గురించి తెలిసి ఆశ్చర్యపోయాను..చాలా బాధ పడ్డాను. అమాయక జంతువులపై ఇలాంటి నేరపూరిత చర్య, ఇతర మానవులపై జరుగుతున్న క్రూరహత్యల కంటే  ఏ మాత్రం  తక్కువ కాదు. ప్రాణాలు కోల్పోయిన ఏనుగుకు తప్పనిసరిగా న్యాయం జరగాలి'' అని రతన్ టాటా పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై పర్యావరణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది.  పూర్తి నివేదిక కోరామనీ, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవడేకర్  ప్రకటించారు.

కాగా గత నెల కేరళలో చోటు చేసుకున్న ఉదంతంపై మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.  మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిన ఈ వైనం పై యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. ఏనుగు బాధాకరమైన మరణం మానవాళి మొత్తాన్ని సిగ్గుపడేలా చేసింది. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో దీనిపై తమ వేదనను, భాధను  పంచుకుంటున్నారు. అంతేకాదు కొల్లం జిల్లాలో ఇలాంటి సంఘటన  మరొకటి వెలుగులోకి వచ్చింది. నోటిలో తీవ్ర గాయాలతో మరో ఆడ ఏనుగు మరణించినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు