‘మాకేం తెలీదు.. ఎలుకలే తాగాయి’

29 Dec, 2018 10:33 IST|Sakshi

లక్నో : అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సీజ్‌ చేసి స్టోర్‌ రూమ్‌లో భద్రపరిచారు పోలీసులు. కొన్ని రోజుల తర్వాత చూడగా ఖాళీ బాటిల్‌లు పోలీసులను వెక్కిరిస్తూ కనిపించాయి. స్టోర్‌ రూమ్‌లో భద్రపరిచిన మద్యం మాయమవడం కంటే.. దానికి పోలీసులు చెప్పిన కారణం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. స్టోర్‌ రూమ్‌లో దాచిన మద్యాన్ని ఎలుకలు తాగాయంటున్నారు పోలీసులు. అది కూడా దాదాపు 1000 లీటర్ల మద్యాన్ని. మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నిజం అంటూ తేల్చారు పోలీసులు. బరేలీ కంటోన్మేంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగింది ఈ సంఘటన.

వివరాలు.. పిచ్చికుక్క ఒకటి పోలీస్‌ స్టేషన్‌ స్టోర్‌ రూమ్‌లో దూరింది. బయటకు వచ్చే దారిలేక అక్కడే మరణించింది. కొన్ని రోజుల తర్వాత స్టోర్‌ రూమ్‌ నుంచి దుర్గంధం వెలువడుతుండటంతో స్టోర్‌ రూమ్‌ని తెరిచారు. ఆ సమయంలో సీజ్‌ చేసి అక్కడ భద్రపరిచిన అక్రమ మద్యం బాటిళ్లు ఖాళీగా కనిపించాయి. ఆ పక్కనే కొన్ని ఎలుకలు ఉన్నాయి. దాంతో ఎలుకలే మద్యం తాగాయని తేల్చారు పోలీసులు. ఈ విషయం గురించి పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ క్లర్క్‌ నరేష్‌ పాల్‌ మాట్లాడుతూ.. ‘నేను తలుపులు ఓపెన్‌ చేసినప్పుడు అక్కడ కొన్ని మద్యం బాటిళ్లు ఖాళీగా కనిపించాయి. వాటి పక్కనే కొన్ని ఎలుకలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఎలుకల పనే’ అన్నారు.

అయితే పోలీసులు చెప్పిన విషయం నమ్మశక్యంగా లేకపోవడానికి కారణం మాయమయ్యింది లీటరో.. రెండు లీటర్లో కాదు ఏకంగా వెయ్యి లీటర్ల మద్యం. దాంతో డిపార్ట్‌మెంట్లోని వారే మద్యం బాటిళ్లను స్వాహా చేసి ఎలుకల మీద తోస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి ఓ రిటైర్డ్‌ జువాలజీ ప్రొఫేసర్‌ మాట్లాడుతూ.. నీరు దొరకనప్పుడు ఎలుకలు మద్యాన్ని తాగుతాయి. అయితే పోలీసులు చెప్పినంత భారీ మొత్తంలో మాత్రం తాగలేవు అన్నారు. గతంలో బిహార్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. పోలీసులు సీజ్‌ చేసిన అక్రమ మద్యం మాయమయ్యింది. అప్పుడు బిహార్‌ పోలీసులు కూడా ఎలుకలే మద్యం తాగాయని ఆరోపించారు.

మరిన్ని వార్తలు