రావీష్‌ కుమార్‌కు గౌరీ లంకేశ్‌ అవార్డు

23 Sep, 2019 19:00 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఇటీవల రామన్‌ మెగసెసే అవార్డు అందుకున్న ప్రముఖ జర‍్నలిస్టు, ఎన్‌డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రావీష్‌ కుమార్‌.. గౌరీ లంకేశ్‌ మెమోరియల్ మొదటి అవార్డును అందుకొన్నారు. ఆదివారం (సెప్టెంబర్ 22) బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో 'పదునైన వార్తల విశ్లేషణ, రాజీలేని లౌకిక వైఖరి' అవలంభించింనందుకు గాను ఆయనను ఈ అవార్డుతో సత్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్ హెచ్ఎస్ దొరస్వామి చేతుల మీదుగా ఈ అవార్డును రావీష్‌కు అందజేశారు.

ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ రెండవ వర్ధంతిని పురస్కరించుకొని గౌరీ లంకేష్ మెమోరియల్ ట్రస్ట్ ఈ అవార్డును ప్రకటించింది. సీనియర్ జర్నలిస్ట్ సిద్ధార్థ్ వరదరాజన్, విద్యావేత్త రహమత్ తారికెరే, ఉద్యమకారుడు తీస్తా సెతల్వాద్‌లతో కూడిన కమిటీ ఈ అవార్డుకు రావీష్‌ కుమార్‌ను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా రావీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. జర్నలిస్టులపై దాడులు అందరినీ ప్రభావితం చేస్తాయని అభిప్రాయ పడ్డారు. 'నాథూరం గాడ్సేను దేశభక్తుడిగా, గాంధీజీని ఉగ్రవాదిగా చూసే కాలంలో మనం జీవిస్తున్నాం. అంతేకాక దేశంలో అసమ్మతివాదులను.. దేశ వ్యతిరేకులు, అర్బన్‌ నక్సల్స్, పాకిస్తాన్‌కు అనుకూరులుగా చిత్రీకరిస్తున్నారు. మన దేశ ప్రజాస్వామ్యం నెమ్మదిగా మరణ దిశగా వెళుతోంది' అని ఆయన పేర్కొన్నారు. కాగా గౌరీ లంకేశ్‌ను బెంగళూరులోని ఆమె ఇంటి ముందు సెప్టెంబర్ 5, 2017న దుండగుడు అతి దారుణంగా కాల్చి చంపాడు.

మరిన్ని వార్తలు