పాక్‌ డీఎన్‌ఏలో శాంతి అనేది లేదు

18 Feb, 2019 04:47 IST|Sakshi
మాట్లాడుతున్న విక్రమ్‌ సూద్‌. చిత్రంలో పద్మనాభయ్య తదితరులు

‘రా’ మాజీ అధిపతి విక్రమ్‌సూద్‌ 

హైదరాబాద్‌: పాకిస్తాన్‌ డీఎన్‌ఏలో శాంతి అనే పదం లేదని కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ ‘రా’ మాజీ అధిపతి విక్రమ్‌సూద్‌ వ్యాఖ్యానించారు. ఆ దేశంతో శాంతి వచనాలు జరపడం వల్ల ప్రయోజనం లేదని తేల్చిచెప్పారు. కశ్మీర్, పాకిస్తాన్‌ అంశాలపై భారత్‌ ఒక జాతీయ విధానం రూపొందించుకోవాలని సూచించారు. ఆదివారం సోమాజిగూడలోని ఆస్కీలో సోషల్‌కాజ్‌ ఆధ్వర్యంలో ‘జాతీయ భద్రతకు బాహ్య నిఘా’అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్రమ్‌సూద్‌ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో ఎన్ని ప్రభుత్వాలు మారినా భారత్‌తో ప్రచ్ఛన్న యుద్ధం సాగించాలని అక్కడి పాలకులు, రాజకీయ పక్షాలు అన్ని ఒకే విధానంతో ఉన్నారని, కానీ భారత్‌లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పాకిస్తాన్‌ సంప్రదాయ యుద్ధంలో గెలవలేమనే, ఇలా పరోక్ష యుద్ధానికి కాలుదువ్వుతోందని ఆరోపించారు. దీన్ని ఎదుర్కొనేందుకు భారత నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఒకే అభిప్రాయానికి రావాలని.. పాక్‌ పట్ల దృఢ వైఖరి అవలంభించాలని సూచించారు. ఆస్కీ చైర్మన్‌ పద్మనాభయ్య మాట్లాడుతూ.. మన నిఘా వ్యవస్థలు అనేక పరిమితుల మధ్య పనిచేస్తున్నాయని, వాటికి అవసరమైన వనరులు కూడా సరిగా అందుబాటులో లేవని, కేవలం నివేదికలు సమర్పించడానికే పరిమితం అవుతున్నాయని ఆరోపించారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌ తరహా వ్యవస్థలను తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం విదేశీ నిఘాపై విక్రమ్‌సూద్‌ రచించిన ‘ది అన్‌ఎండింగ్‌ గేమ్‌’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ కె.రామచంద్రారావు, సోషల్‌కాజ్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ సోమరాజు సుశీల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు