మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించిన ఆర్బీఐ

18 Feb, 2019 19:58 IST|Sakshi

సాక్షి, ముంబై : సార్వత్రిక ఎన్నికలకు ముందు పథకాల సత్వర అమలుకు కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ నుంచి నిధుల ఊతం అందిరానుంది. కేంద్ర ప్రభుత్వానికి రూ 28.000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ చెల్లించేందుకు ఆర్బీఐ బోర్డు సోమవారం ఆమోదం తెలిపింది. మోదీ ప్రభుత్వానికి కేంద్ర బ్యాంక్‌ వరుసగా అడ్వాన్స్‌ చెల్లింపులు జరపడం ఇది రెండో ఏడాది కావడం గమనార్హం.

రైతులకు ప్రకటించిన నగదు సాయంతో పాటు ద్రవ్యలోటుకు కళ్లెం వేసేందుకు ఆర్బీఐ నిధులు కేంద్రానికి ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఇక రైతులకు ప్రభుత్వం ప్రకటించిన నగదు సాయం కింద మార్చి 31లోగా తొలివిడత 12 కోట్ల మంది రైతులకు రూ 2000 అందచేసేందుకు రూ 20,000 కోట్లు అవసరం కానుండగా ఆర్బీఐ నిధులు కొంత మేర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తాయి. కాగా ఈ ఏడాది ఆర్బీఐతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ప్రభుత్వం రూ 74,140 కోట్ల డివిడెండ్లను ఆశిస్తుండగా, వచ్చే ఏడాది డివిడెండ్ల రూపంలో ప్రభుత్వానికి రూ 82,910 కోట్లు సమకూరతాయని అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు