వందేళ్లలో ఘోర సంక్షోభమిది

12 Jul, 2020 02:54 IST|Sakshi
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ఆరోగ్య, ఆర్థిక రంగాలకు ఇంత దుస్థితి ఎన్నడూ లేదు

భారత ఆర్థిక వ్యవస్థకిది విషమ పరీక్షే

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్యలు  

ముంబై: ఆర్థికంగా, ఆరోగ్య పరంగా గడిచిన వందేళ్లలో ప్రపంచం ఎన్నడూ ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కోలేదని భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. కోవిడ్‌తో ఉద్యోగాలు, ఉత్పత్తి, సంక్షేమం వంటి అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రతికూల పరిణామాలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ఎన్నెన్నో సంక్షోభాలను తట్టుకుని నిలిచిన భారత ఆర్థి క, ద్రవ్య వ్యవస్థలకు ఇది అత్యంత విషమ పరీక్ష’ అన్నారాయన. శనివారమిక్కడ ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ అండ్‌ ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో దాస్‌ మాట్లాడారు.

దేశ ద్రవ్య వ్యవస్థను చక్కదిద్దడానికి ఆర్‌బీఐ ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలు ఫలితాలనిస్తున్నాయన్నారు. లాక్‌డౌన్‌లోను, తదనంతరం కూడా ఆర్థిక వృద్ధి క్షీణించిందని, ఫలితంగా బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏలు) పెరిగాయని దాస్‌ చెప్పారు. బ్యాంకుల మూలధనం క్షీణించిందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్‌ బ్యాంకులకు రీ క్యాపిటలైజేషన్‌ పథకం అమలు చేయాల్సి ఉందన్నారు. అన్‌లాక్‌ ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయని శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు.  

పరిశ్రమ మెరుగ్గా స్పందించింది
‘ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం, విశ్వాసాన్ని పెంపొందించడం, వృద్ధిని పునరుద్ధరించడం ఆర్‌బీఐ తక్షణ కర్తవ్యాలు. నిజానికి సంక్షోభ సమయంలో భారతీయ పారిశ్రామిక రంగం, సంస్థలు మెరుగైన రీతిలో స్పందించాయి. చెల్లింపు వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు ఎలాంటి ఆటుపోట్లకు గురికాకుండా నిలిచాయి’ అని దాస్‌ వ్యాఖ్యానించారు.

సప్లయ్‌ చెయిన్‌ పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది? డిమాండ్‌ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేదెప్పుడు? ఆర్థికాభివృద్ధిపై కరోనా ప్రభావం ఎలా ఉండనుంది వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేదన్నారు.

ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షిస్తూ.. బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎలాంటి ఒడిదుడుకులకూ లోను కాకుండా చూస్తూ.. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తోందన్నారు. ఫైనాన్షియల్‌ రంగం మాత్రం ఆంక్షల సడలింపుల కోసం ఎదురు చూడకుండానే తిరిగి మామూలు స్థితికి రావాల్సిన అవసరముందని చెప్పారు.

రిజల్యూషన్‌ కార్పొరేషన్‌..
ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక సంస్థలతో వ్యవహరించడానికి చట్టబద్ధత కలిగిన ’రిజల్యూషన్‌ కార్పొరేషన్‌’ అవసరమని శక్తికాంత దాస్‌ చెప్పారు. ఈ కార్పొరేషన్‌ ఏర్పాటుతో ఆయా సంస్థలను ముందుగానే గుర్తించి హెచ్చరిండానికి, వీలైతే పునరుద్ధరించడానికి వీలుంటుందన్నారు. ‘దీని ఏర్పాటుతో పాటు ఇతర నిబంధనలతో కూడిన ఫైనాన్షియల్‌ రిజొల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌(ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లును ప్రభుత్వం 2017లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే, డిపాజిటర్ల డబ్బు కు రక్షణ ఉండదంటూ వ్యతిరేకత వ్యక్తం కావడంతో దాన్ని వెనక్కి తీసుకుంది’ అని వివరించారు. కానీ రిజల్యూషన్‌ కార్పొరేషన్‌ అవసరం చాలా ఉందన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా