2వేల నోటు ముద్రణ ఆపేసిన ఆర్‌బీఐ!

3 Jan, 2019 18:04 IST|Sakshi

న్యూఢిల్లీ:  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండువేల రూపాయల నోటు ముద్రణను ఆపివేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. మనీలాండరింగ్‌ను తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. పన్నుల ఎగవేతకు, అక్రమ ఆస్తులు దాచిపెట్టేందుకు 2వేల రూపాయల నోట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని  ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తుంది. దీనిని ఆరికట్టేందుకు  కేంద్రం 2వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసింది. తాజా నిర్ణయంతో ముద్రణ ఆగిపోయినా కూడా రెండు వేల రూపాయల నోట్లు చెలామణీలోనే ఉండనున్నాయి.

మొత్తం 18.03లక్షల కోట్ల రూపాయల డబ్బు చెలామణీలో ఉండగా, అందులో 37 శాతం (6.73లక్షల కోట్లు) 2వేల రూపాయల నోట్లు ఉండగా, 43 శాతం 500 రూపాయల నోట్లు ఉన్నాయి. కాగా, భారత్‌లో బ్లాక్‌మనీని ఆరికట్టడానికి 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న బీజేపీ సర్కార్‌.. అప్పుడు వాడుకలో ఉన్న 1000, 500 రూపాయల నోట్లను రద్దుచేసింది. వాటి స్థానంలో 2వేల రూపాయల నోటును తీసుకువచ్చింది. కాగా, గత కొంతకాలంగా రెండు వేల రూపాయల నోట్లను కేంద్రం ఉపసంహరించనుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు